స్వల్పంగా తగ్గిన సూచీలు
ముంబై, జనవరి 8: వరుసగా రెండు ట్రేడింగ్ సెషన్ల పతనానికి క్రితం రోజు బ్రేక్ వేసిన స్టాక్ సూచీలు తిరిగి బుధవారం స్వల్ప నష్టాలతో ముగిసాయి. ట్రేడింగ్ తొలిదశలో క్షీణించిన ఐటీ షేర్లకు ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మద్దతు లభించడంతో ముగింపు సమయానికి ఆ షేర్లు లాభపడ్డాయి.
మరోవైపు బ్యాంకింగ్ షేర్లలో రోజంతా అమ్మకాల ఒత్తిడికిలోనై నష్టాలతో ముగిసాయి. ఈ క్రమంలో స్టాక్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇం ట్రాడేలో 712 పాయింట్లు క్షీణించి 77,486 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది. చివరకు 50 పాయింట్ల నష్టంతో 78,148 పాయిం ట్ల వద్ద నిలిచింది.
ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 23,496 పాయింట్ల వద్ద కనిష్టస్థాయిని తాకిన అనంతరం చివరకు 19 పాయింట్ల లాభంతో 23,689 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సూచీలు కనిష్ఠస్థాయి నుంచి కోలుకోవడానికి ఐటీ షేర్లతో పాటు ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కారణం.
అయితే ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు సూచీల రికవరీకి అడ్డుకట్ట వేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి నాలుగేండ్ల కనిష్ఠం 6.4 శాతానికి పరిమితమవుతుందంటూ వెలువడిన ప్రభుత్వ గణాంకాలు, రూపాయి క్షీణత మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని ట్రేడర్లు చెప్పారు.
టీసీఎస్ ఫలితాలపై దృష్టి
గురువారం వెల్లడికానున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ క్యూ3 ఆర్థిక ఫలితాలపై దృష్టి కేంద్రీకరించిన ఇన్వెస్టర్లు ఆ షేరుతో పాటు ఇతర ఐటీ షేర్లలో కనిష్ఠస్థాయి వద్ద కొనుగోళ్ళు జరిపారని విశ్లేషకులు చెప్పారు. టీసీఎస్ ఇబిటా మార్జిన్లు మెరుగుపడవచ్చన్న అంచనాలు ఉన్నాయని మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖెమ్కా తెలిపారు. యూఎస్ డాలర్ పటిష్టత ఐటీ తదితర ఎగుమతి ఆధారిత కంపెనీలకు మేలు చేకూరుస్తుందన్న అంచనాలు ఉన్నాయన్నారు.
అదానీ పోర్ట్స్ టాప్ లూజర్
సెన్సెక్స్ ప్యాక్‌లో అదానీ పోర్ట్స్ అన్నింటికంటే అధికంగా 1.90 శాతం తగ్గింది. అల్ట్రాటెక్ సిమెంట్, లార్సన్ అండ్ టుబ్రో, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు 1.8 శాతం వరకూ క్షీణించాయి. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, మారుతి సుజుకిలు 1.8 శాతం వరకూ పెరిగాయి.
వివిధ రంగాల సూచీల్లో అధికంగా కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 1.86 శాతం తగ్గింది. క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.34 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 1.26 శాతం, పవర్ ఇండెక్స్ 1.17 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 0.95 శాతం చొప్పున తగ్గాయి.
ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్, రియల్టీ, టెక్నాలజీ, ఐటీ సూచీలు లాభపడ్డాయి. ఐటీ, టెక్నాలజీ సూచీలు తగ్గాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.12 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.09 శాతం చొప్పున తగ్గాయి.
ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ.3,362 కోట్లు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగించారు. బుధవారం ఎఫ్‌పీఐలు రూ.3,362 కోట్ల నికర అమ్మకాలు జరిపినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈ వారం తొలి మూడు రోజుల్లో వీరి నికర అమ్మకాలు రూ.7,300 కోట్లను మించాయి.