* ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్
ముంబై, డిసెంబర్ 10: యూఎస్‌లో కార్పొరేట్లు ఐటీ వ్యయాల కోసం బడ్జెట్లు పెంచుతాయన్న అంచనాలతో ఇన్వెస్టర్లు మంగళవారం సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ స్టాక్స్‌ను జోరుగా కొనుగోలు చేశారు. దీంపతో పలు ఐటి షేర్లు వాటి ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి సమీపంలో ముగిసాయి. మరోవైపు ఇతర రంగాల్లోని కొన్ని హెవీవెయిట్ షేర్లను విక్రయించడంతో రోజంతా స్టాక్ సూచీలు పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనై, చివరకు ఫ్లాట్‌గా ముగిసాయి.
ఇంట్రాడేలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 81,726 పాయింట్ల గరిష్ఠస్థాయి, 81,182 పాయింట్ల మధ్య ఊగిస లాడి చివరకు 1.5 పాయింట్లు లాభంతో 81,510 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 24.677 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనై చివరకు 9 పాయింట్లు నష్టపోయి 24,610 పాయింట్ల వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐలు సూచీలు ఇంట్రాడే నష్టాల నుంచి రికవరీకావడానికి తోడ్పడ్డాయని ట్రేడర్లు తెలిపారు.
ద్రవ్యోల్బణం గణాంకాలపై దృష్టి
వరుసగా మూడవ ట్రేడింగ్ సెషన్‌లో మార్కెట్ నిస్తేజంగా ముగిసిందని, దేశీయ, యూఎస్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో స్టాక్ సూచీలు బల హీనంగానే ట్రేడవుతాయని అంచనా వేస్తున్నట్లు స్టాక్స్‌బాక్స్ టెక్నికల్ అనలిస్ట్ అమేయా రణదివే చెప్పారు. డిసెంబర్ 11న యూఎస్, 12న భారత్ నవంబర్ నెల రిటైల్ ద్రవ్య్లోల్బణం డేటా వెలువడుతుందని, అలాగే ఈ నెల మూడవవారంలో యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రకటిస్తుందని, ఈ కీలక అంశాల కారణంగా సమీప భవిష్యత్తులో మార్కెట్ ఒడిదుడుకులు కొనసాగు తాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
ఎఫ్‌పీఐల కొనుగోళ్లు 1,285 కోట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లో కొద్ది రోజులుగా నికర పెట్టుబడులు పెడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) మంగళ వారం రూ. 1,285 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొన్నట్లు స్టాక్ ఎక్సేంజీల తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనితో గత వారం రోజులుగా ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు రూ.14,000 కోట్లను మించాయి.
బజాజ్ ఫిన్‌సర్వ్ టాపర్
సెన్సెక్స్ ప్యాక్‌లో అన్నింటికంటే అధికంగా బజాజ్ ఫిన్‌సర్వ్ 1.6 శాతం లాభపడింది. హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్‌లు 1.3 శాతం వర కూ పెరిగాయి. మరోవైపు భారతి ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, లార్సన్ అండ్ టుబ్రోలు నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో రియల్టీ ఇండెక్స్ 1.22 శాతం, ఐటీ ఇండెక్స్ 0.84 శాతం, మెటల్స్ ఇండెక్స్ 0.42 శాతం, కమోడిటీస్, ఫైనాన్షియల్ సర్వీసుల సూచీలు 0.36 శాతం చొప్పున పెరిగాయి. టెలికమ్యూనికేషన్, యుటిలిటీస్, పవర్, సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు నష్టపోయా యి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.33 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.30 శాతం చొప్పున పెరిగాయి.