calender_icon.png 3 November, 2024 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వానికి పేరొచ్చేలా పనిచేయాలి

03-11-2024 12:00:00 AM

  1. తప్పు జరిగితే కఠిన నిర్ణయాలు తప్పవు
  2. పైరవీలు, పరిచయాలను పక్కన బెట్టాలి 
  3. వర్సిటీల గౌరవం పెంచే దిశగా పనిచేయాలి 
  4. వీసీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
  5. 50 శాతం పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్?

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరొచ్చేలా పనిచేయాలని, మంచి పనులు చేసేందుకు యూనివర్సిటీ వీసీలకు స్వేచ్ఛ ఉంటుందని, ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒకవేళ తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన యూనివర్సిటీ వీసీలు, తెలం గాణ ఉన్నత విద్యామండలి చైర్మన్, వైస్ చైర్మన్ శనివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డితో మర్యాదపూర్వ కంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో యూనివర్సిటీల గత, ప్రస్తుత పరిస్థితులపై సీఎం చర్చిం చారు. పైరవీలు, పరిచయాలను పక్కనబెట్టి వీసీలు పనిచేయాలని సీఎం సూచించారు.

మెరిట్, సామాజిక సమీకరణాల ఆధారంగానే వీసీలను ఎంపిక చేశామని తెలిపారు. కొంతకాలంగా యూనివర్సిటీలపై నమ్మకం సన్న గిల్లుతోందని పేర్కొన్నారు. విద్యాశాఖ అంటే పనికిరాని శాఖ అయిపోయిందని వీసీలతో సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

ఒకప్పుడు ఉస్మానియా వర్సిటీకి మంచి పేరుండేదని, ఈ వర్సిటీ పరిస్థితి ఇప్పుడేం బాగోలేదన్నారు. ఉస్మానియా, జేఎన్టీయూల్లో చదివితే గర్వంగా చెప్పుకొనే రోజులుండేవని, తిరిగి వర్సిటీ గౌరవం పెంచే దిశగా పనిచేయాలని దిశానిర్ధేశం చేశారు. గతంలో పనిచేసిన వీసీలను యేళ్ల తరబడిగా విద్యార్థులు గుర్తు పెట్టుకునే వాళ్లని, ఇప్పుడా పరిస్థితిలేదన్నారు. యూనివర్సిటీల ప్రతిష్ఠను పెంచాలని ఆదేశించారు. 

ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

వర్సిటీల ప్రస్తుత పరిస్థితులను సమగ్ర అధ్యయనం చేసి, వాటి ప్రమాణాలు పెంచే విధంగా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అవసరమైతే కన్సల్టెంట్లను నియమించుకుని నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. వర్సిటీల్లో డ్రగ్స్, గంజాయిలను అరికట్టాలని, ఈ విషయంలో విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని సీఎం సూచించారు.

ఆర్జీయూకేటీలో అనేక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాలని ఆ వర్సిటీ వీసీని ఆదేశించారు. యూనివర్సిటీల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీల గురించి కొంతమంది వీసీలు సీఎం రేవంత్‌రెడ్డితో ప్రస్తావించినట్లు తెలిసింది. 50 శాతం ఖాళీ పోస్టులను భర్తీ చేద్దామని సీఎం సంకేతాలిచ్చినట్లు సమాచారం.

నెల రోజుల తర్వాత మళ్లీ సమావేశమవుదామని, ఒక్కో వీసీకి గంటపాటు సమయం కేటాయిస్తానని చెప్పినట్లు తెలిసింది. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్  పురుషోత్తం,  వివిధ వర్సీటీల వీసీలు పాల్గొన్నారు.