హైదరాబాద్ నగరం మధ్యలోంచి వెళ్లే మూసీనది సుందరీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కన్సల్టెంట్ల నుండి బిడ్ల ను సైతం ఆహ్వానిస్తోంది. మూసీ సుందరీకరణ నగర అభివృద్ధికి దోహదపడుతుందని సామాజిక, ఆర్థిక వేత్తలు విశ్వసిస్తున్నారు. ఇందుకోసం మూసీనది కారిడార్ వెంట రోడ్ కమ్ మెట్రో రైల్ నిర్మించాలని ప్రభుత్వ నిర్ణయించింది. దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకు ప్రజా రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తా యి.
మూసీ నది పరీ వాహక ప్రాంత అభివృద్ధికి తాజాగా తెలంగాణ నూతన ప్రభుత్వం అడుగులు వేయడం వల్ల మూసీ నది పునరుజ్జీవన ప్రక్రియ ఊపందుకుంది. మూసీ పరిసరాలను లండన్ థేమ్స్ రివర్ ఫ్రంట్ తరహా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించడం అభినందనీయం. మూసీనది అభివృద్ధి సహజవనరుల,మానవ వనరుల వికాసానికి దోహదపడే చర్యగా అభివర్ణించ వచ్చు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం కొన్ని చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉంది.
మూసీ నది పునర్జీవన ప్రక్రియలో పెట్టుబడులను ఆకర్షిం చేందుకు ప్రభుత్వం మూసీ అభివృద్ధి, పాలనానిర్వహణకు స్వతంత్ర ప్రతిపత్తితో ప్రత్యేక పాలనా విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ప్రజా భాగస్వామ్యంతో మూసీ సుందరీకరణ జరగాలి. ఆధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మూసీనది సహజత్వాన్ని రక్షించాలి. మూసీ వెంబడి ప్రకృతి పర్యావరణ రక్షణ, ఉద్యాన వనాలు,ఆహ్లాదాన్ని ఇచ్చే పార్కులు, పిల్లలకు ప్రత్యేకంగా జల క్రీడలు, ఆట ప్రదేశాలు, బోటింగ్ సౌకర్యం వంటి వాటి కోసం ప్రభుత్వం రూ.9 వేలకోట్ల అంచనాతో పనులు చేపట్టనుంది.
దీంతో మూసీ పరిసర ప్రాంతాల్లో వ్యాపార,వాణిజ్య కేంద్రాలు ఏర్పడుతాయి. ప్రత్యక్ష, పరోక్ష, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి. షాపింగ్ మాల్స్, హోటల్స్ రెస్టారెంట్స్, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు ఏర్పడతాయి. ఫలితంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి. యువత పనుల్లో నిమగ్నం కావడం వల్ల శాంతియుత వాతావరణం నెలకొంటుంది. మూసీ వెంట రహదారిని అభివృద్ధి పరచడం, మెట్రోతో పాటు నదీగర్భంలో ఎల్లవేళలా నీరు ఉండేలా చేసి బోట్ ప్రయాణాన్ని నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రణాళికల రూపకల్పన జరగడం శుభ సూచకం.
మూసీ వెంబడి, మూసీకి ఆనుకొని ఉన్న చారిత్రక ప్రదేశాలను, చార్మినార్,తారామతి, బారాదరి మున్నగు చారిత్రక, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను కలుపుతూ పర్యాటక వలయాన్ని రూపొందిస్తే పర్యాటకులను ఆకర్షించే అవకాశం వుంటుంది. అక్రమ నిర్మాణాలతో కుంచించుకు పోయి మూసీ మురుగు కాలువగా మారింది. మూసీలో పడేసే వ్యర్థాలలో అధిక శాతం విషపూరిత రసాయనాలు వుండడం వల్ల వీటిని శుధ్ధి చేయడం పెద్ద సవాల్ గా పరిణమించింది.
కాలకూట విషంలా మారిన మూసీ నదిని సమూలంగా ప్రక్షాళన చేయాలి. విషపూరిత పారిశ్రామిక వ్యర్థాలు కలపకుండా కఠిన చట్టాలు అమలు చేయాలి. అధునాతన సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలి. అభివృద్ధి చెందిన దేశాలు వాడుతున్న పరిజ్ఞానాన్ని పరిశీలించాలి. రాజకీయాలకు అతీతంగా మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఆక్రమణలు తొలగించి సహజ ప్రవాహ మార్గాన్ని పునరుద్ధరించాలి.
అభివృద్ధిలో భాగంగా మూసీ నదికి ఆనుకొని ఉన్న చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు దెబ్బతినకుండా చూడాలి. ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు యుద్ధ ప్రాతిపదికన నడుం బిగిస్త్తేనే రాబోయే తరాలకు మేలు చేసిన వారమవుతాం. ఇందుకు మూసీ నదీ పరివాహక ప్రాంతంలో నివాసం వుండే ప్రజలు, అసోసియేషన్స్‌ను మూసీ ప్రక్షాళనలో భాగస్వాములను చేయాలి.