25-04-2025 01:32:51 AM
జిల్లా స్థాయి యాంటీ డ్రగ్ కమిటీ సమావేశం లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెంను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా స్థాయి యాంటీ డ్రగ్ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు,యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మాదకద్రవ్యాలు వినియోగం లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు వినియోగించకుండా ఉండేలా కళాశాల యజమాన్యాలు, తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలన్నారు. మాదకద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్పోస్టుల ద్వారా నిరంతరనిగా నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లాలో గంజాయి తో పాటు గుడుంబా నివారణకు సైతం అవసరమైన చర్యలు కచ్చితంగా చేపట్టాలన్నారు.అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు, రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.ఈ సమీక్ష సమావేశంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో డిఎస్పి శరత్, అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ కరంచంద్, ఎక్సైజ్ సీఐ జానయ్య, డ్రగ్ ఇన్స్పెక్టర్ సంపత్, కొత్తగూడెం ఆర్ టి ఓ వెంకటరమణ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.