13-03-2025 12:03:55 AM
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, మార్చి 12(విజయక్రాంతి): బాల్య వివాహాల రహిత జిల్లాగా మెదక్ జిల్లాను తీర్చిదిద్దాలని, ఇందుకుగాను సంబంధిత శాఖల సమన్వయం చాలా అవసరమని మహిళా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హితవు పలికారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డి డబ్ల్యూ హైమావతి, అడిషనల్ డిఆర్డిఓ సరస్వతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయలక్ష్మి, ఎస్సీ సంక్షేమ అధికారిని శశికళ, గిరిజన సంక్షేమ అధికారిని, నీలిమ , మెప్మా పీడీ ఇందిరా, సిడబ్ల్యుసి చైర్మన్ ఉప్పలయ్య, లతో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని, జ్యోతి ప్రజ్వలన గావించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు సంఘటితంగా పోరాడాలని మన దేశ ప్రధానిగా పనిచేసిన ఇందిరా గాంధీ ఒక మహిళేనని, మహిళలందరూ ఉన్నత పదవులు అధిరోహిస్తూ రాణిస్తున్నారన్నారు. మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో మహిళా సాధికారత దిశగా ముందుకు పోతుందని తెలిపారు. 80 శాతం వరకు మహిళలే జిల్లా అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారని పేర్కొన్నారు.
జిల్లా అభివృద్ధిలో వారి కృషి ఎంతో ఉందన్నారు.ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. వరకట్న, గృహహింస కేసులు అరికట్టడానికి నడుం బిగించాలన్నారు. గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అనేక అవకాశాలు కల్పిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు.
రాచరిక వ్యవస్థ లో కూడా మహిళలకు సముచిత స్థానం ఉండేదని, సమాన పనిగంటలు సమాన వేతనం గురించి గతంలో సంఘటిత పోరాటమే ఈనాటి స్ఫూర్తిదాయకమని తెలిపారు. మహిళా సాధికారత దిశగా ముందుకు పోవాలన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఎంతగానో అలరించాయి.
ఐడీఓసీని నిత్యం పరిశుభ్రంగా ఉంచుతున్న మహిళా శానిటేషన్ సిబ్బందిని, మహిళా పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించి, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓలు స్వరూప, హేమ, భార్గవి, వెంకట రమణ, పద్మలత జిల్లాలోని ఐసిడిఎస్ సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.