ఐటీడీఏ పీవో రాహుల్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ట్రైబల్ మ్యూజియం అభివృద్ధి కొరకు జరుగుతున్న పనులు ముగింపు దశకు వస్తున్నందున పర్యాటకులకు ఇబ్బందులు కలగకుండా పనికిరాని వస్తువులేవి ఉంచకుండా మ్యూజియంను సర్వసుందరంగా పర్యాటకులు ఆకట్టుకునేలా సిద్ధం చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. ఆదివారం నాడు ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను ఆయన సందర్శించి మ్యూజియంలో జరుగుతున్న పనులు, వివిధ కళాఖండాలు సక్రమంగా అమర్చినవి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మ్యూజియం చుట్టూ ఉన్న వెదురుతో తయారుచేసిన దడిని మల్టీ కలర్ తో అందంగా తీర్చిదిద్దాలని, పర్యాటకులు గిరిజన మహిళలు, పురుషులు సాంప్రదాయక దుస్తులు వేసుకొని ఫోటోలు దిగడానికి ప్రత్యేకంగా మనిషి రూపంలో ప్రతిమను మ్యూజియం లోపల అమర్చాలని, లోపల ఉన్న ఖాళీ ప్రదేశంలో పర్యాటకులు గిరిజన సంప్రదాయానికి సంబంధించిన పచ్చబొట్లు గోరింటాకులు, సరదాగా ఫోటోలు దిగడానికి ఏర్పాట్లు చేయాలని, ఖాళీగా ఉన్న గోడల పైన పాతకాలపు గిరిజనులకు సంబంధించిన పెయింటింగ్ బొమ్మలు వేయించాలని అన్నారు.
మ్యూజియంలో అమర్చిన గిరిజన కల్చర్ కు సంబంధించిన వస్తువుల అరలలో వాటికి సంబంధించిన పేర్లు, చరిత్ర రాసి పర్యాటకులకు కనిపించే విధంగా డిజైన్ చేయాలని అన్నారు. మ్యూజియం ప్రారంభోత్సవ సమయం దగ్గరపడుతున్నందున మ్యూజియం పరిసరాలు మ్యూజియం లోపల పూర్తిగా శుభ్రం చేయించాలని అన్నారు. సెల్ఫీ పాయింట్ను పరిశీలించి పర్యాటకులు సెల్ఫీ తీసుకునేలా చుట్టూ విద్యుత్ దీపాలతో అలంకరించాలని, స్వాగత ద్వారం దగ్గర నుండి మ్యూజియం వరకు తాటి మట్టలు అందంగా తయారు చేసి విద్యుత్ దీపాలు అలంకరించాలని అన్నారు. పాతకాలపు నివాస గృహాలు పూర్తయినందున అందమైన గిరిజనులకు సంబంధించిన కళాఖండాలు చిత్రీకరించాలని అన్నారు. ఈనెల 7వ తేదీ నుండి సన్నాహక రివర్స్ ఉత్సవాలకు సంబంధించి కల్చరల్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నందున గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలో ఉండే బాలబాలికలతో గిరిజనుల కల్చర్ కు సంబంధించిన ఆటపాటలు ఏర్పాట్లు చేయాలని అన్నారు. అనుకున్న సమయం కంటే ముందుగానే మ్యూజియమును తయారు చేయడంలో శ్రద్ధ చూపినందుకు అధికారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏసిఎంఓ రమణయ్య, డిఈ హరీష్, ఏపీఓ పవర్ ఏఈ మునీర్ పాషా, జేడీఎం హరికృష్ణ, మ్యూజియం ఇంచార్జ్ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.