25-03-2025 05:56:20 PM
జనాభా ప్రాతిపదికన ఎస్సీ నియోజకవర్గంగా ప్రకటించాలి...
జిల్లాలో ఎస్సీలకు నియోజకవర్గం కేటాయించాలి...
జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు.. తోటమల్ల రమణమూర్తి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను విడదీసిన సమయంలో కొత్తగూడెం, అశ్వరావుపేట, ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాలు జిల్లా పరిధిలోకి వచ్చాయని, కొత్తగూడెం అసెంబ్లీ సీటు జనరల్ కాగా, మిగతా నాలుగు నియోజకవర్గాలు ఎస్టీలకు కేటాయించారని, జిల్లాలో ఎస్సీలకు ఒక్క అసెంబ్లీ సీటు లేకపోవడంతో ఎస్సీల ప్రజాప్రతినిధి లేరని, దీనితో జిల్లాలో దళితులు అధికంగా ఉన్నా అభివృద్ధిలో వెనుకబడి ఉండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే పునర్విభజనలో కొత్తగూడెం జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పాల్వంచ మండలాన్ని విడదీసి, పాల్వంచ మండలం, ములకలపల్లి మండలం, బూర్గంపాడు మండలాలను కలుపుతూ పాల్వంచ అసెంబ్లీ నియోజకవర్గంగా ప్రకటించి, జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ సీట్లు ఎస్సీలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దీనివల్ల పాలనా సౌలభ్యం జరగడమే కాక, జిల్లాలో దళితులకు ప్రాతినిధ్యం కల్పించినట్లు అవుతుందని ఆయన తెలిపారు. త్వరలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ నాయకత్వంలో, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుమల్ల సుందర్రావు ఆధ్వర్యంలో పాల్వంచను నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించి, అసెంబ్లీ సీటును ఎస్సీలకు కేటాయించే వరకు దశల వారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు పల్లంటి రమేష్, కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు గుడివాడ రాము, నాయకులు పెంకి శ్రీనివాస్, కాల్వ రామారావు, పిల్లి మల్లేష్, గుర్రం లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.