19-02-2025 01:29:59 AM
ఇదే ప్రభుత్వ లక్ష్యం
సెక్యూర్ బిజినెస్ హబ్‌గానూ మార్చాలి
హైదరాబాద్, ఫిబ్రవరి 18(విజయక్రాంతి): సైబర్ సేఫ్ స్టేట్‌గా తెలంగాణను మార్చేందుకు అందరం కలిసి పనిచేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు చ్చారు. సైబర్ నేరాలను అరికట్టడంలో ఏదో ఒక రాష్ట్రం చేసే ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వబోవని అభిప్రాయపడ్డారు. దేశంలోనే సైబర్ సేఫ్టీలో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపడమే తమ సర్కారు లక్ష్యమన్నారు.
నేరాల విధానం వేగంగా మారు తోందని చెప్పారు. సైబర్ క్రైమ్‌ను నియంత్రించడంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందని స్పష్టం చేశా రు. మంగళవారం హెచ్‌ఐసీసీ నోవాటెల్ లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ), సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్‌సీఎస్‌సీ) ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ కాన్‌క్లేవ్-2025(షీల్డ్)ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
మొదటిసారి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను సీఎం అభినందించారు. సైబర్ నేరాల నియంత్రణకు రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని, అందుకు అవసరమై న వారధిని నిర్మించేందుకు చొరవ తీసుకున్న తెలంగాణ సైబర్ క్రైమ్ టీమ్‌ను ఆయన అభినందించారు.
సైబర్ క్రైమ్ విషయంలో సమాజంలో వస్తున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకో వాలని పిలుపునిచ్చారు. సైబర్ భద్రత కోసం రాష్ట్రాలు.. దేశాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ క్రైమ్ విభాగాన్ని మ రింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం నొక్కి చెప్పారు. నేరం జరిగిన తరువాత పట్టుకోవడం కాదు..
నేరం జరగకుండా నిరోధించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కొందరు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారన్నారు. ఫేక్ వార్తలతో పాటు ఆర్థిక నేరాలను కూడా నిరోధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తద్వారా సైబర్ క్రైమ్ నియంత్రణలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చా రు. తెలంగాణను సెక్యూర్ బిజినెస్ హబ్‌గా మార్చాలని అధికారులకు సూచించారు.
ఆర్థిక వ్యవస్థకు సైబర్ ముప్పు..
దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు పౌరులకు సైబర్ ముప్పు పొంచిఉందని సీఎం చెప్పా రు. దేశంలో సైబర్ నేరగాళ్లు గత ఏడాది రూ. 22,812 కోట్లు దోచుకున్నారని గణాంకాలు చెబుతున్నాయన్నారు. సోష ల్ మీడియాలో తప్పుడు సమాచారంతో సమాజం లో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.
సైబర్ సెక్యూరిటీ సొల్యూష న్స్ కోసం ఎకో సిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు తమ నిపుణులు ఐటీ సంస్థలతో కలిసి పనిచేయడానికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 అందరికీ షేర్ చేయాలని పిలుపునిచ్చారు.
గత ఏడాది 7 కొత్త ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లను ప్రారంభించామని, పూర్తిస్థాయిలో పనిచేసే సైబర్ సెక్యూరిటీ బ్యూరో, పౌరులను రక్షించడానికి అంకితమైన సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. ఈ సౌకర్యాలను ఏర్పాటు చేసిన డీజీపీ, సైబర్ బ్యూరో డైరెక్టర్‌ని ఈ సందర్భంగా సీఎం అభినందిం చారు. గతేడాది 18వేల మంది సైబర్ బాధితులకు రూ.183 కోట్లు తిరిగి చెల్లించడంపై హర్షవ్యక్తం చేశారు.
త్వరలో కొత్త సెక్యూరిటీ పాలసీ డేటా భద్రత కీలకం..
ప్రజల డేటాను కాపాడేందుకు త్వరలో కొత్త సైబర్ సెక్యూరిటీ పాలసీని తీసుకరాబోతున్నట్లు రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. సైబర్ నేరాలను తగ్గించేందుకు కాకుండా ఆదిలోనే అడ్డుకట్ట వేసే వ్యవస్థపై తమ సర్కారు దృష్టి సారించినట్లు చెప్పారు. రాష్ర్ట ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
ఏఐ లాంటి అత్యాధునిక టెక్నాలజీ సాయంతో గిగా వాట్ డేటా సెంటర్‌ను నెలకోల్పనున్నట్లు వెల్లడించారు. సైబర్ స్పేస్‌లో ఆధిపత్యం కోసం అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో డేటా భద్రత అత్యంత కీలకమైన అంశంగా మారిందని గుర్తు చేశారు. సైబర్ నేరగాళ్లు డబ్బుల కోసం కాకుండా డేటా కోసం నేరాలకు పాల్పడుతున్నారన్నారు.
ఆ సమాచారం తో ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల కాలం లో సైబర్ నేరస్థులు సుమారు రూ.350 కోట్లు లూటీ చేస్తే.. రాష్ట్ర పోలీసులు రూ. 183 కోట్లు రికవరీ చేయడంపై మంత్రి హర్షం వ్యక్తంచేశారు.
ఏటా 7 బిలియన్ డాలర్ల విలువైన ఫైర్ వాల్ మొదలు యాంటీ వైరస్ తదితర సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను విదేశాల నుంచి ఎగుమతి చేసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రపంచం లోనే అత్యధికంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను తయారుస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు.
కానీ, ఇతర దేశాల నుంచి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను దిగుమతి చేసుకొని రావాల్సి రావడం పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మన గురించి ఎక్కువ గూగుల్‌కే తెలుసంటూ మంత్రి చలోక్తి విసిరారు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కే కొద్ది సైబర్ నేరగాళ్లు మోసాలు చేసేందుకు కొత్తదారులు వెతుక్కుంటూ నిపుణులకే సవాల్ విసురుతు న్నారన్నారు.
ఏఐ వచ్చిన తర్వాత వారి పని మరింత సులువయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు 10 ట్రిలియన్ డాలర్ల సొమ్ము కొల్ల గొడుతున్నారన్నారు. భారత్‌లో ఈ సొమ్ము రూ.15వేల కోట్ల వరకు ఉంటుందని చెప్పా రు. చాలామంది మోసపోయినా పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదన్నారు.
ప్రజలు సైబర్ మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణ యువతను సైబర్ నిపుణులను తయారు చేస్తున్నామన్నామని వివరించారు.
కార్యక్రమంలో హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ డా. జితేందర్, టీజీసీఎస్ బీ డైరెక్టర్ శిఖా గోయల్, సైబరాబాద్ సీపీ అవినాష్ మోహంతి, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ రమేష్ కాజా, వివిధ రాష్ట్రాలకు చెందిన సైబర్ నిపుణులు, విద్యార్థులు, ప్రతినిధులు మొత్తం 900 మంది పాల్గొన్నారు.