- వేలమందికి రూ.1.45 లక్షల వరకూ పన్ను నోటీసులు
- ఫారం 16ఏ, ఫారం 26ఏఎస్‌ల్లో వ్యత్యాసాలతో ఎర్రర్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: పలువురు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ శాఖ) షాక్ ఇచ్చింది. దాదాపు 30,000 మందికి అదనపు పన్ను చెల్లించాలంటూ డిమాండ్ నోటీసులు జారీ చేసింది. రెండు ఫారాల మధ్య వ్యత్యాసాల కారణంగా నోటీసులు వచ్చాయని, తక్షణ పరిష్కారం కోసం ఐటీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్టు టీసీఎస్ హ్యుమన్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులకు ఊరట కల్పించింది.
ఉద్యోగులకు రూ. 50,000 నుంచి రూ. 1.45 లక్షల వరకూ పన్ను నోటీసులు అందినట్లు సమాచారం. అదాయపు పన్ను శాఖ నుంచి క్లారిఫికేషన్ వచ్చేంతవరకూ ఎవరూ నోటీసులకు అనుగుణంగా పన్నులు చెల్లించవద్దని ఉద్యోగులకు గురువారం ఈ మెయిల్ ద్వారా భరోసా ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఐటీ అధికారుల నుంచి క్లారిఫికేషన్ అందినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఏం జరిగిందంటే..
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ముగిసిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ట్యాక్స్ డిడెక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్)కు సంబంధించి ఈ డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. కంపెనీ ఉద్యోగులకు టీడీఎస్‌కు సంబంధించి జారీచేసే ఫారం 16ఏ, ఆదాయపు పన్ను శాఖ జారీచేసే ఫారం 26ఏఎస్‌ల్లో వ్యత్యాసాల కారణంగా ఈ నోటీసులు వచ్చాయి. ఫారం 26 ఏఎస్‌లో ఉన్న సమాచారానికి అనుగుణంగా ఐటీ శాఖ ఉద్యోగులు సమర్పించే రిటర్న్‌లను విశ్లేషిస్తుంది.
ఈ ఎర్రర్‌ను సరిచేసి, రిటర్న్‌లను పన్ను అధికారులు రీప్రాసెస్ చేస్తారని తాము భావిస్తున్నామని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నోటీసులు అందుకున్నవారికి తదుపరి రోజుల్లో రెక్టిఫికేషన్ సమాచారం వస్తుందని, డిమాండ్ పన్ను మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని ఆ వర్గాలు వివరించాయి. ఐటీ శాఖ నుంచి రెక్టిఫికేషన్ ఇంటిమేషన్ వస్తే వ్యత్యాసాల సమస్య తొలగిపోయినట్లేనని ఆ వర్గాలు పేర్కొన్నాయి.