calender_icon.png 8 February, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ లేనట్టే!

08-02-2025 12:42:36 AM

కొలిక్కివచ్చిన పీసీసీ కార్యవర్గ కూర్పు

కూర్పులు, చేర్పులపై అధిష్ఠానానిదే తుది నిర్ణయం

  1. నాకు, రాహుల్‌గాంధీకి మధ్య నో గ్యాప్
  2. ప్రతిపక్ష నేతలను వెంటనే జైలుకు పంపాలనే ఆలోచన మాకు లేదు
  3. ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
  4. మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని, మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. న్యూఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియా  ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పలు అంశాలపై స్పష్టతనిచ్చారు.

మంత్రివర్గ విస్తరణపై తాను ఎవరి పేర్లనూ హైకమాండ్‌కు ప్రతిపాదించలేదని స్పష్టం చేశారు. మంత్రివర్గంలో కూడికలు, తీసివేతలపై పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారన్నారు. ప్రతిపక్ష నేతల కేసుల విష యంలో చట్టం తన పని తాను చేసుకుం టూ వెళ్తుందని, వారు వెంటనే అరెస్ట్ అయితే బాగుంటుందనే ఆలోచన తనకు లేదని చెప్పుకొచ్చారు.

పీసీసీ కార్యవర్గ కూర్పు అంశం ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చిందని, ఒకటిరెండు రోజుల్లో కూర్పుపై అధికారికంగా ప్రకటన వస్తుందని వెల్లడించారు. తాను తాజాగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరలేదని, రాహుల్‌గాంధీకి తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు.

రాహుల్‌గాంధీతో తనకున్న అనుబంధం గురించి తెలియనివాళ్లు చేసే వ్యాఖ్యలను తాను పట్టించుకోనని వెల్లడించారు. రాష్ట్రంలో కులగణన ప్రక్రియ ఆషామాషీ గా చేసింది కాదని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని జాగ్రత్తగా చేశామని చెప్పారు. కులగణనలో బీసీలు ఐదున్నర శాతం పెరిగారని, సదరు గణాంకా లను చూసిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిండు సభలో ఒప్పుకొన్నారని గుర్తుచేశారు.

కులగణనతో ముస్లిం రిజర్వేషన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తమ పార్టీ తీసుకునే అన్ని కీలకమైన నిర్ణయాలు అధిష్ఠానం దృ ష్టిలో ఉంటాయని స్పష్టం చేశారు. తమ అధిష్ఠానానికి తెలియకుండా తాము నిర్ణయాలు తీసుకుంటామని భావించేవాళ్లకు తాను చెప్పేది ఏమీ లేదని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నేతల మనోభావాలకు అనుగుణంగానే తాను నడుచుకుంటానని, వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోనని తెలి పారు. పార్టీ ఇచ్చిన పనిని నిబద్ధతతో పూర్తిచేయడమే తనముందున్న లక్ష్యమన్నారు. తనకు పని చేసుకుంటూ ముందుకు వెళ్లడ మే తెలుసునని,  ప్రతి ఒక్క విమర్శకూ తా ను స్పందించాలని కోరుకోనని తెలిపారు.

అశావహులకు షాక్..

తెలంగాణ వచ్చిన పదేండ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ పగ్గాలు చేపట్టి కూడా ఏడాది దాటింది. ఇక నేడో రేపో క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని, మరో ఐదారుగురిని మంత్రి పదవి వరిస్తుందని, దీనిలో భాగంగా తమకూ మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశపడిన నేతలకు తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు షాక్‌నిచ్చాయి.

ఇప్పట్లో క్యాబినేట్ విస్తరణ ఉండదని సీఎం ప్రకటించడంతో ఆశావహులు నీరుగారిపోయారు. మళ్లీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడుంటుందోనని వారంతా ఎదురుచూడటం చేసేదేమీ లేదని నిట్టూరుస్తున్నట్లు తెలిసింది.