calender_icon.png 24 January, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడో రోజూ ఐటీ సోదాలు

24-01-2025 01:31:08 AM

  1. దిల్‌రాజు, మైత్రీమూవీస్, మ్యాంగో మీడియా సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు
  2. ‘గేమ్‌చేంజర్’ కలెక్షన్లపై ప్రశ్నలు? 
  3. అధికారుల తీరుపై దిల్‌రాజు అసహనం

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 23 (విజయక్రాంతి) : టాలీవుడ్ నిర్మాతలు, వారి బంధువుల ఇండ్లలో, కార్యాలయాల్లో మంగళవారం నుంచి జరుగుతున్న ఐటీ సోదాలు వరుసగా మూడో రోజూ కొనసాగాయి. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెం ట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్‌రాజు, మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన నవీన్ ఎర్నేనికి చెందిన ఇండ్లు, వారి కార్యాలయాలతో పాటు మ్యాంగో మూవీస్ సంస్థ ల కార్యాలయాల్లోనూ తనిఖీలు చేశారు.

ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల బడ్జెట్, వచ్చిన ఆదాయం, పన్ను చెల్లింపుల మధ్య తేడాలున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయా సంస్థల వ్యాపారాలకు చెందిన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

టార్గెట్ సంక్రాంతి వసూళ్లు

ఇటీవల విడుదలైన సినిమాల వసూళ్లు, చెల్లించిన పన్నుల వివరాలను సేకరిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, అంతకు ముందు విడుదలైన ‘పుష్ప-2’ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. కాగా ఆ సినిమాలకు సంబంధించిన బ్యాలెన్స్ షీట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.

దిల్‌రాజుకు చెందిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఆధ్వర్యంలో మెగా హీరో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘గేమ్‌చేంజర్’ సినిమాకు రూ.400కోట్లు వసూళ్లు వచ్చినట్లు జరిగిన ప్రచారంపై ఎస్‌వీసీ సంస్థ ప్రతినిధులను ఐటీ అధికారులు ప్రశ్నించారు.

అది సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమేనని, అంత మొత్తంలో కలెక్షన్లు రాలేదని బదులిచ్చినట్లు తెలుస్తోంది. పుష్ప-2 సినిమా దర్శకుడు సుకుమార్ ఇంట్లో బుధవారం చేపట్టిన తనిఖీలు గురువారం మధ్యాహ్నం ముగిసినట్లు తెలుస్తోంది. ఆయన ఆఫీసులో అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

దిల్‌రాజు తల్లికి అస్వస్థత..

వరుసగా మూడు  రోజులుగా సోదాలు జరుగుతుండగా, గురువారం దిల్‌రాజు ఇంట్లోనే దాదాపు 20మంది అధికారులు పాల్గొన్నారు. ఈ తనిఖీలు కొనసాగుతున్న క్రమంలో అకస్మాత్తుగా దిల్‌రాజు తల్లి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఐటీ అధికారుల వాహనంలోనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. దిల్‌రాజు కుటుంబసభ్యులతో పాటు ఐటీ అధికారులు కూడా ఆస్పత్రికి వెళ్లారు.

ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఆస్పత్రికి వెళ్లిన సందర్భంలో దిల్‌రాజు తల్లితో మాట్లాడాలని ఐటీ అధికారులు ఆయనకు ఫోన్ ఇవ్వగా ఆయన తీసుకోలేదు. వారి తీరుపై  అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.