గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చారు!
- సంధ్య థియేటర్ ఘటనలో లోపించిన మానవతా దృక్పథం
- ఎవరో ఒకరు బాధిత కుటుంబం దగ్గరకు వెళ్లి ఉంటే బాగుండేది
- రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది
- చట్టం అందరికీ సమానమే
- రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు
* వైసీపీ విధానాల తరహాలో తెలంగాణలో వ్యవ హరించలేదు. బెనిఫిట్ షోలకు అనుమతించారు. టికెట్ ధర పెంపునకు సైతం అవకాశమిచ్చారు. రేవంత్‌రెడ్డి సహకా రంతోనే ‘సలార్’, ‘పుష్ప2’ వంటి సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. సోమవారం మంగళగిరిలో మీడియాతో ఆయన చిట్‌చాట్‌గా మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు.
చిరంజీవి కూడా గతంలో అభిమానులతో కలిసి సినిమాలు చూసేందుకు వెళ్లే వారు, కానీ ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్‌కు వెళ్లేవారని తెలిపారు. సంధ్య థియేటర్ ఘటనపై వ్యాఖ్యానిస్తూ.. గోటి తో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారని అన్నారు. ‘రేవంత్ రెడ్డి కిందిస్థాయి నుంచి ఎదిగిన గొప్ప నాయకుడు.
వైసీపీ విధానాల తరహాలో తెలంగాణలో వ్యవహరించలేదు. బెనిఫిట్ షోలకు అనుమతించడమే కాకుండా టికెట్ ధర పెంపునకు సైతం అవకాశమిచ్చారు. ఆయన సహకారంతోనే ‘సలార్’, ‘పుష్ప2’ వంటి సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. ఈ క్రమంలోనే పలు సినిమాల కలెక్షన్లు సైతం పెరిగాయి. ముఖ్యంగా ‘పుష్ప2’కు టికెట్ల పెంపునకు అవకాశం ఇస్తూ రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరించారు.
హీరో వస్తున్నారంటే జనాలు ఎగబడతారు. అల్లు అర్జున్ విషయంలో తెర వెనుక, ముందు ఏం జరిగిందనే విషయం నాకు పూర్తిగా తెలియదు. కానీ చట్టం అందరికీ సమానం. ఇలాంటి ఘటనల్లో పోలీసులు భద్రత గురించే ఆలోచిస్తారు కాబట్టి వారిని తప్పుబట్టను. రేవతి మరణం నన్ను కలచి వేసింది. థియేటర్ సిబ్బంది అయినా ముందు అల్లు అర్జున్‌కు చెప్పడమో..
లేదంటే సీటులో కూర్చొన్నాక అయినా చెప్పి బయటకు తీసుకెళ్లాల్సింది. ఘటనపై అల్లు అర్జున్‌కు చెప్పి ఉన్నా కూడా అరుపుల్లో వినిపించకపోయి ఉండొచ్చు. అల్లు అర్జున్ అభివాదం చేయకుండా వెళ్లిపోతే ఆ నటుడికి పొగరు, బలుపు అని అందరూ చర్చ పెడతారు. అందుకే ప్రమాద విషయం తెలిసినా అభివాదం చేయక తప్పదు.
కనీసం ఘటన జరిగాక అయినా అల్లు అర్జున్ తరుఫున ఎవరో ఒకరు బాధిత కుటుంబం దగ్గరకు వెళ్లి ఉంటే బాగుండేది. అంత వివాదం అయ్యుండేది కాదు. అదీ కాదంటే మేమంతా ఉన్నామని ముందే చెప్పి.. తమ ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయిందని విచారం వ్యక్తం చేసి ఉండాల్సింది. అంతా కలిసి రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది.
ఈ ఘటనలో ఎక్కడో మానవతా థృక్పదం లోపించింది. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారు. రేవతి కుటుంబాన్ని పరామర్శించకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. తనవల్ల ఓ ఆడబిడ్డ చనిపోయారనే ఆవేదన అల్లు అర్జున్‌లోనూ ఉంది. సినిమా అంటేనే టీం కాబట్టి ఈ ఘటనలో అల్లు అర్జున్‌ను ఒక్కడినే దోషిగా మార్చడం కూడా సరికాదు’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
పరిస్థితులను బట్టే నిర్ణయాలు..
‘తొక్కిసలాట ఘటన అనంతర పరిణామాలపై సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయనకు రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు చిన్నగా ఉన్నప్పటి నుంచే తెలుసు. అల్లు అర్జున్ మామ కూడా కాంగ్రెస్ నేత. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయి.
అంతకుముందు సినిమా ఫంక్షన్‌లో రేవంత్ పేరు చెప్పలేదని అలా చేశారనుకోవడం లేదు. పుష్ప సినిమా బెనిఫిట్ షోకు టికెట్ రేట్లు పెంచేందుకు రేవంత్ రెడ్డి అనుమతించారు. అలాంటప్పుడు రేవంత్ రెడ్డిని ఎలా తప్పు బడతాం?’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.