calender_icon.png 21 January, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు

21-01-2025 12:57:49 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రముఖ సినీ నిర్మాత, టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు(TFDC Chairman Dil Raju) ఇళ్లు, కార్యాలయం సహా ఎనిమిది వేర్వేరు ప్రదేశాల్లో ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. వర్గాల సమాచారం ప్రకారం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో దిల్ రాజు నివాసంతో పాటు ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె హన్సిత రెడ్డి, బంధువుల నివాసాలతో సహా ఎనిమిది వేర్వేరు ప్రదేశాల్లో తనీఖలు జరుపుతున్నారు. ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన రెండు భారీ బడ్జెట్ చిత్రాలను దిల్ రాజు నిర్మించారు. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రెండు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లోనే తెరకెక్కాయి. జనవరి 10న  పాన్-ఇండియన్ చిత్రం గేమ్ ఛేంజర్, 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమా మూడు రోజుల వ్యవధిలోనే విడుదలయ్యాయి.

ఈ రెండు కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన్నప్పటికి పాన్-ఇండియన్ చిత్రం గేమ్ ఛేంజర్ అంచనాలను అందుకోలేకపోగా డిజాస్టర్ అనే ముద్రను వేయించుకుంది. సంక్రాంతికి వస్తున్నాం మాత్రం భారీ కలెక్షన్లను రాబట్టుకుంటోంది. ఈ రెండు సినిమాలు కూడా ఆ స్థాయిలోనే కలెక్షన్లు సాధించాయంటూ అధికారికంగా ప్రకటించుకోవడం వంటి పరిణామాలు ఈ ఐటీ దాడులకు కారణమైనట్లు చెబుతున్నారు. దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీల సందర్భంగా అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.  కొనసాగుతున్న దాడుల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దిల్ రాజు అసలు పేరు వెలంకుచ వెంకట రమణ రెడ్డి. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ను ఆయన స్థాపించారు. ఇటీవల ఆయనను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు చైర్మన్‌గా నియమించింది.