- ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, నిర్మాత నవీన్ ఎర్నేని ఇళ్లల్లో సోదాలు
- ఏకకాలంలో 8చోట్ల 55బృందాలతో తనిఖీలు
- 12గంటలకు పైగా కొనసాగిన సోదాలు
- ఆదాయం, పన్ను వివరాలను పరిశీలించిన అధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 21 (విజయక్రాంతి) : ప్రముఖ సినీ నిర్మాతల కార్యాలయాల్లో ఐటీ(ఇన్‌కమ్ టాక్స్) అధికారులు నిర్వహించిన దాడులు టాలీవుడ్‌లో మంగళవారం కలకలం సృష్టించాయి. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎఫ్‌డీసీ) ఛైర్మన్ దిల్ రాజు ఇంట్లో, ఆయన కుమార్తె హన్సితారెడ్డి, సోదరుడు శిరీష్, బంధువులు, వ్యాపారుల ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు.
దీంతోపాటు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేత, పుష్ప -2 సినిమా నిర్మాత నవీన్ ఎర్నే ని, సీఈవో చెర్రీ ఇండ్లు, కార్యాలయా ల్లో, ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా సంస్థల్లోనూ తనిఖీలు నిర్వహించారు. మంగళవారం ఉదయం 6గంటలకు మొదలైన ఈ సోదాలు దాదాపు 12 గంటలకు పైగా కొనసాగాయి. ఏకకా లంలో 8చోట్ల 55బృందాలతో దాదాపు 200మంది ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చి బౌలి, కొండాపూర్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. గతంలోనూ పలుమార్లు సినీ నిర్మాతల ఇండ్లలో తనిఖీలు చేసిన ఐటీ అధికారులు సుదీర్ఘకాలం పాటు తనిఖీలు నిర్వహించడంతో టావీవుడ్‌లో కలకలం రేగినట్లయింది.
దిల్‌రాజుకు చెందిన బ్యాంకు లాకర్ల పరిశీలన
ఐటీ అధికారుల తనిఖీల సందర్భంగా అధికారులు పలు కీలక పత్రాలను పరిశీలించి, వాటి వివరాలను తెలుసుకున్నట్లు సమాచారం. ఆయా సంస్థలకు చెందిన గత ఆర్థిక లావాదేవీలు, ఇటీవల వచ్చిన ఆదా యం వివరాలపై ఆరా తీసినట్లు తెలుస్తోం ది. కాగా.. సోదాల సందర్భంగా దిల్‌రాజు సతీమణి వైగారెడ్డిని ఐటీ అధికారులు కారులో తీసుకెళ్లి వారికి బ్యాంక్ లాకర్లను పరిశీలించిన అనంతరం తీసుకువచ్చారు.
లాకర్లను ఓపెన్‌చేయడానికి ఐటీ అధికారులు తనను తీసుకెళ్లినట్లు దిల్‌రాజు భార్య తెలిపారు. ఇవి సాధారణంగా జరిగే సోదాలేనని ఆమె అన్నారు. ఐటీ అధికారు లు బ్యాంకు వివరాలు అడిగారని, బ్యాంకు లా కర్స్ ఓపెన్ చేసి చూపించామని తెలిపారు.
ఆ సంస్థల సినిమాలకు భారీ ఆదాయం
దిల్‌రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ‘గేమ్‌ఛేంజర్’ సినిమాలు ఇటీవల విడుదల య్యాయి. ఈ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్లను రాబట్టాయి. ఇప్పటి వరకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రూ.150కోట్లకు పైగా, గేమ్ ఛేంజర్ సినిమా 120కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఐటీ అధికారులు దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలు, బంధువుల ఇండ్లలో తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది.
మైత్రీ మూవీస్ వారు తెరకెక్కించిన పుష్ప-2 సినిమాకు కూడా దేశవిదేశాల్లో దాదాపు రూ.12వందల కోట్లకు పైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. మ్యాంగో మీడి యా సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసిన ‘డాకూ మహారాజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రూ.70కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు, మూవీ మేకర్స్ సంస్థల కార్యాలయాలు, బంధువుల ఇండ్లలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.