calender_icon.png 1 April, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగిత్యాల ఆర్డీవో ఆఫీస్‌లో ఐటీ దాడులు

22-03-2025 12:51:57 AM

  • రికార్డులు సీజ్ చేసి తీసుకెళ్లిన అధికారులు రూ. 50 లక్షల వరకు చేతివాటం?
  • పరిహారం చెల్లింపులో అవకతవకలు  

జగిత్యాల, మార్చి 21 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని జగిత్యాల ఆర్డీవో ఆఫీస్’లో ఐటి అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. రైల్వే భూసేకరణలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు చెల్లించాల్సిన పరిహారంలో ఆర్డీవో కార్యాలయ సిబ్బంది ఎవరికీ దొరక్కుండా సినీ ఫక్కిలో రికార్డుల నిర్వహణలో తమ చేతివాటాన్ని ప్రదర్శించారు.

ఈ ఆరోపణల మేరకు అవకతవకలు జరిగాయా లేదా అని క్రమంలో గురువారం మధ్యాహ్నం నుండి రాత్రి తెల్లవార్లు ఇన్కమ్ టాక్స్ అధికారులు జగిత్యాల ఆర్డీవో కార్యాలయంలో సోదాలు జరిపి కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే 2006 సంవత్సరంలో జిల్లాలో రైల్వే లైన్ నిర్మాణ పనుల కోసం చేపట్టిన భూ సేకరణలో పలు ప్రాంతాల రైతులు తమ సాగు భూములను కోల్పోయారు.

ఇందుకుగానూ ప్రభుత్వం భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించింది.  అయితే తమకు ఈ పరిహారం సరిపోదని అదనపు పరిహారం చెల్లించాలని రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2019లో భూ నిర్వాసితులకు అదనపు పరిహారంతో పాటూ వడ్డీ కూడా చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రైతులకు ఇచ్చే పరిహారం మొత్తానికి ఆదాయం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు కానీ, వడ్డీకి టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

పాన్ కార్డు ఉన్న రైతులకు 10 శాతం పాన్ కార్డు లేని రైతులకు 20 శాతం టీడీఎస్ చెల్లించారు. పక్కా సమాచారం మేరకు ఐటి అధికారులు దాడులు నిర్వహించగా, అదనంగా చెల్లించిన టీడిఎస్ తిరిగి రాబట్టేందుకు ఆర్డీవో కార్యాలయ అధికారులు ఓ  ఆడిటర్ ద్వారా అవకతవకులకు పాల్పడినట్లు గుర్తించారు.

20% ఆదాయ పన్ను చెల్లించిన రైతులకు సంబంధించిన ట్యాక్స్’ను తిరిగి రాబట్టేందుకు ఇతరుల పాన్ కార్డులను సబ్మిట్ చేసి, ఆ మొత్తాన్ని కాజేసినట్లు ఐటి అధికారులు గుర్తించారు. ఆర్డీవో కార్యాలయంలో సంబంధిత పైళ్లను పరిశీలించి ప్రైవేటు ఆడిటర్ను ప్రశ్నించారు.

సుమారుగా రూ. 50 లక్షల వరకు అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక అంచనా. అయితే అధికారికంగా ఎలాంటి వివరాలు ప్రకటించకుండా సంబంధిత ఫైళ్లను సీజ్ చేసి ఐటి అధికారులు తీసుకెళ్లినట్లు సమాచారం. మొత్తం మీద రైల్వే ప్రాజెక్ట్ భూ సేకరణలో జగిత్యాల ఆర్డిఓ కార్యాలయ సిబ్బంది తమదైన శైలిలో చేతివాటం ప్రదర్శించిన తీరు, ఐటి అధికారుల దాడులతో వెలుగు చూసింది.