calender_icon.png 24 January, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిల్‌ రాజును ఎస్‌వీసీ ఆఫీస్‌కు తీసుకెళ్లిన ఐటీ అధికారులు

24-01-2025 01:32:29 PM

హైదరాబాద్: నగరంలో నాలుగో రోజు ఐటీ దాడులు(Income Tax Department) కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో భాగంగా సినీ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజును అధికారులు తన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations )కి తీసుకెళ్లారు. దిల్ రాజు ఇంట్లో అధికారులు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా ఆదాయానికి, నిర్మాణ సంస్థలు చెల్లించిన పన్నుకు తేడాలున్నాయని గుర్తించిన అధికారులు ఆయా సంస్థల కార్యాలయాలపై దాడులు ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju ) ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం నాలుగో రోజు సోదాలు కొనసాగించింది. జూబ్లీహిల్స్‌లోని ఉజాస్ విల్లాస్‌లోని నిర్మాత ఇంట్లో మహిళా అధికారి నేతృత్వంలోని ఐటీ అధికారుల బృందం సోదాలు కొనసాగించింది. తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC) చైర్మన్‌గా ఉన్న దిల్ రాజు అసలు పేరు వి.వెంకట రమణ రెడ్డి. నిర్మాత కూడా అయిన దిల్ రాజు సోదరుడి ఇంట్లో ఐటీ శాఖ సోదాలు పూర్తి చేసింది. దిల్ రాజు, అతని బంధువుల ఇళ్లలో జరిగిన సోదాలు ‘గేమ్ ఛేంజర్’,‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాల నిర్మాణానికి సంబంధించినవి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన రెండు సినిమాలు ఇటీవలే విడుదలయ్యాయి. రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10, 2025న విడుదలైంది.

‘సంక్రాంతికి వస్తున్నాం’ గత వారం సంక్రాంతి రోజున విడుదలైంది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాత అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఐటీ అధికారులు(IT officers) సినిమాల నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. బ్యాలెన్స్ షీట్లు, ఐటీ రిటర్న్‌లు వంటి కీలక పత్రాలను వారు తనిఖీ చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా వారు బ్యాంకు లాకర్లను తనిఖీ చేశారు. దిల్ రాజు భార్య తేజస్వినిని మంగళవారం ఒక బ్యాంకుకు తీసుకెళ్లి ఆమె సమక్షంలో లాకర్లను తెరిచారు. గత మూడు రోజులుగా, ఐటీ అధికారులు ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా ప్రాంగణాలను కూడా సోదా చేస్తున్నారు.

సోదాల గురించి ఆ శాఖ ఇంకా ఒక ప్రకటన విడుదల చేయలేదు. కానీ కొన్ని ఇటీవలి సినిమాలు సంపాదించిన ఆదాయాలకు, చెల్లించిన ఆదాయపు పన్నుకు మధ్య అసమతుల్యతను అధికారులు గుర్తించినట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్‌లో జరిగిన సోదాలు అల్లు అర్జున్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘పుష్ప 2: ది(Pushpa 2: The Rule) రూల్’కి సంబంధించినవి, ఇది రూ. 1,500 కోట్ల వ్యాపారం చేసినట్లు టాక్ ఉంది. బుధవారం ఐటీ అధికారులు ‘పుష్ప 2’ దర్శకుడు సుకుమార్(Director Sukumar) కార్యాలయం, ఇతర ప్రాంగణాలపై కూడా దాడులు నిర్వహించారు.