05-04-2025 11:20:43 PM
జనగణమన, గోల్డ్, కడువ సినిమాల ఆదాయంపై వివరణ ఇవ్వండి
‘ఎంపురాన్’ నిర్మాత ఇంట్లో ఈడీ సోదాలు.. 1.5 కోట్లు సీజ్
తిరువనంతపురం: మోహన్‌లాల్ నటించిన ఎంపురాన్ సినిమాపై రోజుకో వివాదం పుట్టుకొస్తోంది. తాజాగా సినిమాకు దర్శకుడిగా వ్యవహరించిన పృథ్వీరాజ్ సుకుమారన్‌కు శనివారం ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. 2022లో పృథ్వీరాజ్ నటించిన మూడు సినిమాలు ‘జనగణమన’, ‘గోల్డ్’, ‘కడువ’ సినిమాలకు వచ్చిన ఆదాయంపై వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు అందినట్టు తెలుస్తోంది. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఈ మూడు సినిమాలను నిర్మించగా.. ఈ మూడు చిత్రాలకు పృథ్వీరాజ్ పారితోషికం తీసుకోలేదు. కానీ మూడు సినిమాల వల్ల రూ. 40 కోట్ల లాభం మొత్తాన్ని పృథ్వీరాజ్ తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. తాజాగా దీనిపై ఏప్రిల్ 29లోగా పృథ్వీరాజ్ సమాధానమివ్వాలని ఐటీశాఖ కోరింది.
ఇప్పటికే సినిమా నిర్మాత గోకుల్ చిట్ ఫండ్ అధినేత, గోకులం గోపాలన్ ఇంట్లో శుక్రవారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో రూ. 1.5 కోట్ల నగదు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. గోకులం చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద దాదాపు వెయ్యి కోట్ల మార్పిడి ఉల్లంఘనలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరిపినట్టు తెలుస్తోంది. సినిమాలో 2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న గోద్రా అల్లర్లకు సంబంధించి సన్నివేశాలు ఉన్నాయి. దీంతో ఈ చిత్రం హిందూ వ్యతిరేక అజెండాను ప్రోత్సహిస్తోందని బీజేపీ సభ్యులు ఆరోపించారు. దీంతో సెన్సార్ సభ్యులు సినిమాను రీసెన్సార్ చేసి 51 కట్స్ చెప్పడం గమనార్హం.