04-03-2025 02:16:48 AM
అనుమతి లేని హోర్డింగుల ఏజెన్సీలకు గడువు ఇస్తున్నాం..
తర్వాత మేమే తొలగిస్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 4 (విజయక్రాంతి): నగరంలో అనుమతులు లేని ప్రకనల హోర్డింగులను తొలగించడానికి ఈ ఆదివారం వరకు ఆయా ఏజెన్సీలకు గడువు ఇస్తున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌గారు తెలిపారు. స్వయంగా అనుమతి లేని హోర్డింగులను తొలగించుకోవాలని లేదంటే తర్వాత ఉన్న వాటిని హైడ్రా తొలగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మూడు నెలల నుంచి ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని, ఇప్పటికే చాలా సమయం ఏజెన్సీలకు ఇచ్చామని సోమవారం ఆయనను కలిసిన యాడ్ ఏజెన్సీ ప్రతినిధులకు చెప్పారు. కాగా 2022 ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన రుసుములు కట్టలేకపోయామని పలువురు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రంగనాథ్ చెప్పారు.
హోర్డింగుల ద్వారా ప్రభుత్వానికి రూ.వందల కోట్ల ఆదాయం రావాల్సి ఉన్నా ప్రస్తుతం దాదాపు రూ.20 నుంచి రూ.30 కోట్లు మాత్రమే వస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయన్నారు. అక్రమ హోర్డింగుల తొలగింపులో ఎలాంటి మినహాయింపులకు హైడ్రా అవకాశం ఇవ్వదని, ప్రభుత్వ ఆదాయం పెరగాలనేదే హైడ్రా లక్ష్యమని కమిషనర్ స్పష్టం చేశారు.