‘ఆర్‌ఆర్‌ఆర్’తో అఖండ విజయం అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ మరోమారు ‘దేవర’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఆయన సరసన జత కడుతోంది. ఆమె తెలుగులో నటిస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. దీంతో అటు ఎన్టీఆర్ అభిమానులు, జాన్వీతో వన్ సైడ్ లవ్ నడిపే సినీ ప్రేమికులు ‘దేవర’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి అప్‌డేట్లు సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తించాయి. ఇదివరకే విడుదలైన ఫియర్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను సైతం మేకర్స్ విడుదల చేశారు.
‘చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరకే ఉండదు కాసేపు.. అస్తమానం నీ లోకమే నా మైమరపు.. చేతనైతే నువ్వే నాన్నాపు... ’ అంటూ సాగే ఈ పాట సోమవారం సంగీతాభిమానుల ముంగిట్లోకొచ్చింది. ఈ గీతానికి రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించగా, శిల్పారావు ఆలపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది.