- స్నేహితులతో కలిసి రూ.35 లక్షల నగదు చోరీ
- పోలీసుల అదుపులో నిందితులు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): సులువుగా డబ్బు సంపాదించేందుకు గతంలో పనిచేసిన సంస్థకే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుధీంద్ర గురువారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాయలంలో కేసు వివరాలను వెల్లడించారు. సర్దార్ హర్‌ప్రీత్ సింగ్, గుర్జీత్ సింగ్ వరుసకు సోదరులు. వీరు తమ స్నేహితులైన మహమ్మద్ గుఫ్రాన్, మన్‌ప్రీత్ సింగ్, శ్రావణ్ దేశెట్టితో కలిసి సులువుగా డబ్బు సంపాదించాలని పథకం రచించారు.
ఈ క్రమంలో నగరంలోని బంజారాహిల్స్ తిబరుమల్ జ్యువెల్లర్స్‌లో గతంలో పనిచేసి న నిందితుల్లో ఒకడైన శ్రావణ్ .. నగల దుకా ణం నుంచి రోజువారిగా వచ్చిన డబ్బును ఇంటికి తీసుకెళ్లి, మరుసటి రోజు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తారని స్నేహితులతో చెప్పాడు. ఇది విన్ని స్నేహితులంతా కలిసి ఆ నగదును దోచుకోవాలని పథకం రచించారు.
పక్కా ప్లాన్ ప్రకారం..
పథకంలో భాగంగా హర్‌ప్రీత్ తన బం ధువు గురుప్రీత్‌సింగ్ నివాసం నుంచి ఎయిర్‌పిస్టోల్‌ను దొంగలించాడు. ఆగస్టు 30వ తేదీ రాత్రి తిబరుమల్ జ్యువెల్లర్స్ మూసివేసిన తర్వాత ఆ రోజు జమ అయిన మొత్తం రూ.50 లక్షలను తీసుకుని మేనేజర్ శ్రీకాం త్ తన సహచరుడితో కలిసి మెహదీపట్నం మీదుగా తన ఇంటికి బయల్దేరాడు. ఇదంతా గమనిస్తున్న మహమ్మద్ గుఫ్రాన్ శ్రీకాంత్ కదలికలను ఫాలో అవుతూ తన స్నేహితులకు సమాచారం చేరవేశాడు.
ఈ క్రమంలో ఇంటికి వెళ్లే దారిలో గుడిమల్కాపూర్ వద్ద గల ‘పాన్.కామ్’ అనే పాన్‌షాప్ దగ్గర పాన్ కోసం ఆగారు. ఇంతలో ప్లాన్ ప్రకారం జాకె ట్లు, హెల్మెట్లు ధరించి వచ్చిన హర్‌ప్రీత్, మన్‌ప్రీత్.. శ్రీకాంత్‌ను ఎయిర్ పిస్టోల్‌తో బెదిరించి రూ.35 లక్షల నగదు గల బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. అనంతరం ఘటనపై శ్రీకాంత్ గుడిమల్కాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి సీసీ కెమెరాల ఆధారంగా కమిషనర్ టాస్క్‌ఫోర్స్, సౌత్‌వెస్ట్ జోన్ బృందం గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి నిందితులను గుర్తించి.. అత్తాపూర్‌కు చెందిన సర్దార్ హర్‌ప్రిత్ సింగ్ రిషీ(22), సర్దార్ గుర్జీత్ సింగ్ రాజ్(21), మహారాష్ట్రకు చెందిన సర్దార్ మన్‌ప్రీత్‌సింగ్ మన్‌ప్రీత్(25), ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు చెందిన మహమ్మద్ గుఫ్రాన్ ఇలాహీ అలియాస్ అబ్బు(20), కార్వాన్ జియాగూడకు చెందిన శ్రావణ్ దేశెట్టి(19)ను అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి మొత్తం విలువ రూ.48.30 లక్షల విలువైన 3 ఐఫోన్లు, 1 ఎయిర్‌పిస్టోల్, ఒక ద్విచక్ర వాహనం, 5 సెల్‌ఫోన్లు, రూ. 43.80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని టాస్క్‌ఫోర్స్ డీసీ పీ సుధీంద్ర, సౌత్‌వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ తెలిపారు.