calender_icon.png 10 March, 2025 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సంక్షోభం సాకుతో కార్మికుల సమస్యలను విస్మరించడం సిగ్గుచేటు

09-03-2025 04:25:49 PM

సీఐటీయూ నాయకులు..

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఆర్థిక సంక్షోభం సాకుతో సమస్యలను విస్మరించడం సిగ్గుచేటని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి మంద నరసింహారావులు విమర్శించారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి గత ఏడాది నవంబర్ 28న జరిగిన స్ట్రక్చర్డ్ సమావేశాల తీర్మానాలను అమలు చేయాలని, సొంతింటి పథకం, పేర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దు చేయాలనీ, మారు పేర్ల మార్పుపై ఉత్తర్వులు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు.

సిఎండితో ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ సమావేశాలలో యాజమాన్యంతో గుర్తింపు సంఘంకి మధ్య జరిగిన చర్చల్లో పలు రకాల సమస్యలను గుర్తింపు సంఘం పరిష్కరించాలని కోరగా యాజమాన్యం నుంచి వచ్చిన సమాధానాలు కార్మిక ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారాయని వారు యాజమాన్యం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. సింగరేణి సొమ్ములను ఇష్టారీతిన దారా దత్తం చేస్తూ, కార్మికుల సమ స్యల పరిష్కారానికి మాత్రం ఆర్థిక సంక్షోభాన్ని చూపించడం సరికాదని యాజమాన్యం తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసిన 35 వేల కోట్ల బకాయిలను వసూలు చేయకుండా సంస్థకు కేవలం వడ్డీ రూపంలో నష్టపోతున్న దానితో పోల్చుకుంటే పెర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ రియంబర్స్మెంట్ సంవత్సరానికి 91 కోట్ల రూపాయలు పెద్ద సమస్య కాదని, అలాగే పైసా ఖర్చు లేకుండా చేయాల్సిన మారుపేర్ల అంశాన్ని కూడా విస్మరించడం, అందరికీ లాభదాయకంగా ఉండేటువంటి సొంత ఇంటి పథకాన్ని పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. 

కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి కమిటీల పేరుతో కాలయాపన చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ట్రక్చర్ సమావేశంలో మరోసారి కార్మికులను మోసం చేసిన ఏఐటీయూసీనీ యాజమాన్యాన్ని నిలదీయాలని వారు కార్మికులకు సూచించారు. సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ సంస్థను కాపాడి కార్మికుల సమస్యల పరిష్కారానికై చేసే కార్యచరణలో కార్మికులందరూ  ఐక్యంగా కలసి వచ్చేల మా వంతు బాధ్యతను నెరవేరుస్తామని వారు స్పష్టం చేశారు.