రుహానీ శర్మ నటించిన ‘ఆగ్రా’ చిత్రం నిరుడు విడుదలైంది. తాజాగా ఓటీటీకొచ్చిన నేపథ్యంలో అందులోని బోల్డ్ సీన్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రుహానీ ప్రైవేట్ వీడియోలంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తుండటంతో ఆమె స్పందిస్తూ ఓ లేఖను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. “ఆగ్రా’లోని సన్నివేశాలు లీక్ అయినప్పట్నుంచి ఎంతో నిరుత్సాహంగా ఉన్నాను. నా బాధను వివరించటానికి నిరుత్సాహం అనే మాట కూడా చిన్నదే. మా కష్టాన్ని, అంకితభావాన్ని విస్మరించి కొన్ని సన్నివేశాలను వైరల్ చేస్తుండటం హృదయవిదాకరంగా ఉంది.
కళాత్మక చిత్రాలను రూపొందించటం పెద్ద సవాలు.. వాటి కోసం నిద్రలేని రాత్రులు గడపాలి.. ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రక్తాన్ని చెమటగా మార్చాలి. కన్నీళ్లను అర్థం చేసుకోకుండా కొందరు దానిగురించి తప్పుగా మాట్లాడుతున్నారు. కొన్ని సన్నివేశాల ఆధారంగా సినిమాపై ఓ నిర్ణయానికి రావటం సరైన పద్ధతి కాదు. ఈ సినిమా ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శితమైంది... అలా చిత్ర బృందానికి గౌరవం దక్కింది.
అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుకున్న ఇంత గొప్ప ప్రాజెక్టులో పనిచేసినందుకు నేనెంతో గర్వపడుతున్నా. ఈ సినిమా శైలిని అందరూ గుర్తించాలని కోరుతున్నాను. కళ ఎప్పుడూ సులభంగా, సౌకర్యంగా ఉండదు. ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. కళాకారుల శ్రమను వృథా చేయకండి. సినిమా గొప్పతనాన్ని చూడండి” అని ఆ లేఖలో పేర్కొంది రుహాని.