calender_icon.png 2 October, 2024 | 5:50 AM

కేన్స్ గుజరాత్‌కు తరలిపోవడం బాధాకరం

04-09-2024 01:18:40 AM

  1. గతంలో కేన్స్‌కు స్థలం కేటాయించాం 
  2. ఇంత జరుగుతున్నా సర్కారులో చలనం లేదు 
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): కేన్స్ సంస్థ తెలంగాణలో పెడతామన్న తన యూనిట్‌ను గుజరాత్‌కు తరలిచేందుకు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయని, అది వింటుంటే చాలా బాధగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సంస్థను కర్ణాటక నుంచి తెలంగాణకు రప్పించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తాము ఎంతో కష్టపడ్డామన్నారు. హైదరాబాద్‌లో తమ యూనిట్ పెట్టాలంటే కొంగర కలాన్‌లోని ఫాక్స్ కాన్ ఫ్లాంట్ పక్కన భూమి కేటాయించాలని వారు కోరడంతో పది రోజుల్లోనే వారికి భూమి కేటాయించి తెలంగాణలో యూనిట్ పెట్టేందుకు ఒప్పించామన్నారు.

దీంతో వాళ్లు గతేడాది అక్టోబర్‌లో తమ యూనిట్‌ను మన రాష్ర్టంలో పెడతామని ప్రకటించినట్లు తెలిపారు. కానీ ఇప్పు డు ఆ సంస్థ గుజరాత్‌కు తమ యూనిట్‌ను తరలిస్తుందన్న వార్తలు చూస్తుంటే చాలా బాధనిపిస్తోందన్నారు. ఎంతో కష్టపడి కేన్స్ సంస్థ మన రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పిస్తే ఇప్పుడు ఆ సంస్థను తరలిపోకుండా కాపాడలేకపోతున్నారని  రేవంత్ రెడ్డి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో దాదాపు రూ. 3500 కోట్లతో కేన్స్ మన వద్ద పెట్టుబడులు పెడతామని చెప్పిందన్నారు. ఆ యూనిట్ ప్రారంభమై ఉంటే మన యువతకు ఉపాధితో పాటు రాష్ట్రానికి ఆదాయం పెరిగేదన్నారు. ఆ సంస్థ ఇక్కడి నుంచి తరలిపోతే తెలంగాణకు చాలా నష్టం జరుగుతుందన్నారు. ఈ యూనిట్‌ను తరలించుకుపోతున్న గుజరాత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.