మీ సంగతి అప్పుడు చూస్తాం
ఫార్మా కంపెనీల పేరుతో సీఎం రేవంత్ రియల్ వ్యాపారం
సీఎం అన్న తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారారు
లగచర్ల ఘటనలో కాంగ్రెస్ వాళ్లూ ఉన్నా.. మా పార్టీ వారినే అరెస్ట్ చేశారు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సంగారెడ్డి, నవంబర్ 15 (విజయక్రాంతి): పదవి ఎవరికీ శాశ్వతం కాదని.. ఢిల్లీ పెద్దలకు కోపం వస్తే సీఎం రేవంత్‌రెడ్డి పదవి ఉండదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, అప్పుడు మీ సంగతి చూస్తామంటూ ధ్వజమెత్తారు. శుక్రవారం సంగారెడ్డి సెంట్రల్ జైల్‌లో ఉన్న వికారాబాద్ జిల్లా లగచర్ల నిందితులతో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. అనంతరం జైకలు బయట మీడియాతో మాట్లాడారు.
లగచర్ల ఘటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉన్నా.. కేవలం బీఆర్‌ఎస్‌కు చెందిన వారినే అరెస్ట్ చేశారని కేటీఆర్ వాపోయారు. ఫార్మా కంపెనీల పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలో రియల్ వ్యాపారం చేస్తున్నారని, రూ.60 లక్షలు, రూ.70 లక్షలకు ఎకరం ఉన్న భూములను ప్రభుత్వం రూ.10 లక్షలకు ఎకరం చొప్పున తీసుకుంటుందన్నారు. ఈ విషయమై పేదలు తొమ్మిది నెలలుగా పోరా టం చేస్తున్నారని, లగచర్లలోనూ ఫార్మా కంపెనీ పేరుతో పేదల భూములను లాక్కొనే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు.
సీఎం రేవంత్‌రెడ్డి రాబందులా మారి 3 వేల ఎకరాల భూమిని తీసుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు గ్రామానికి వస్తే నిరసన తెలిపిన రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి, వికారాబాద్ ఎస్పీ, కొండగల్ సీఐ, ఎస్‌ఐలు రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు. జడ్జికి చెబితే మీ ఇంటి వాళ్లను కూడా కొడతామని హెచ్చరించారన్నారు. పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న రాఘవేంద్ర యాదవ్ ప్రభుత్వం చేస్తున్న సామగ్ర సర్వేలో ఉండి, ఇంటికి రాగానే అరెస్ట్ చేశారని ఆరోపించారు.
వనపర్తిలో ఐటీఐలో చదువుకుంటున్న గిరిజన విద్యార్థి, తల్లిదండ్రులను చూసేందుకు ఇంటికి వస్తే అక్రమం గా అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దుద్యాల మండలాధ్యక్షుడు శేఖర్, అతడి అనుచరులు రమేశ్, నర్సింలు, రాములు నాయక్ అధికారులపై దాడి చేసినా అరెస్ట్ చేయలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారి అధికారులతో ఫోన్‌లో మాట్లాడి బీఆర్‌ఎస్‌కు చెందినవారిని అరెస్ట్ చేయిస్తు న్నారని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి చక్రవర్తి కాదని, పేదల భూములను లాక్కుంటే తిరగబాటు తప్పదన్నారు. ఇప్పుడు కొండగల్ ప్రజలు తిరగబడగా.. ముందుముందు తెలంగాణ సమాజమంతా తిరుగబడుతుందని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. జైల్లో ఉన్న 21 కుటుంబాలకు బీఆర్‌ఎస్ అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తుందన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో ఫార్మాసిటీ పేరుతో రైతుల భూములను తీసుకోనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.
న్యాల్‌కల్, కొండగల్ రైతుల పక్షన బీఆర్‌ఎస్ న్యాయ పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో మాజీమంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్, సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, బాల్క సుమన్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జాన్సన్ నాయక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, నవీన్‌కుమార్ రెడ్డి పాటు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.