24-03-2025 01:14:11 AM
ఎస్‌టీయూ భద్రాద్రి జిల్లా కమిటీ
భద్రాద్రి కొత్తగూడెం మార్చి 23 (విజయ క్రాంతి) రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు బకాయి పడిన డిఏలు, పి ఆర్ సి ఇవ్వలేమని ప్రభుత్వం ప్రకటించడం సమంజసం కాదని ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు బి.చందర్ అన్నారు.ఆదివారం కొత్తగూడెంలోని ఎస్.టి.యు భవన్ లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ,ఉపాధ్యాయు లకు బకాయి పడిన ఐదు డి.ఎ.లను, జులై 2023 నుండి అమలు చేయాల్సిన పీఆర్సీని అడగొద్దని, అవి కావాలంటే నెలనెలా జీతాలే ఇవ్వలేమని ప్రకటించటం సరికాదు అని ఉద్యోగ,ఉపాధ్యాయుల గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని వారికి న్యాయంగా రావాల్సిన బకాయిలను ,వారు దాచుకున్న సొమ్మును వారికి తిరిగి చెల్లించాలని మాత్రమే అడుగుతున్నారు.
ఎ.స్.టి.యు భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి. లాల్ మహమ్మద్ మాట్లాడుతూ.... కాంగ్రెసు పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో నిర్దిష్ట గడువుతో పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగ,ఉపాధ్యాయు లకు ,పెన్షనర్లకు మాత్రమే నెల మొదటి తేదీన వేతనాలు ఇవ్వడం మినహా మరే సమస్య పరిష్కారం కాలేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలలు కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, నూతన పథకాలకు వేల కోట్ల రూపాయలు కేటాయించి అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయంగా ఇవ్వాల్సిన బకాయిలకు డబ్బులు లేవని చెప్పడం చాలా బాధ కరం అన్నారు.
ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగం. వారి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రధాన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. గతంలో ముఖ్యమంత్రి స్వయంగా దశల వారిగా ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు అన్ని పరిష్కారిస్తానన్న హామీ ఇచ్చి 15 నెలలు అయినా నేటికి నెరవేరలేదు.ఆర్థిక, ఆర్థికేతర అనే తేడా లేకుండా ఉపాధ్యాయ, ఉద్యోగుల మరియూ రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం లేదని.. ఉపాధ్యా యులలో నెలకొన్న అసంతృప్తి తీవ్రమై పోరాటానికి దారితీసే అవకాశం ఉందని. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఐదు డి.ఏ లను, పీ.ఆర్.సి, పెండింగ్ బిల్లులను,రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే చెల్లించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్.టి.యు) భద్రాద్రి జిలా ప్రధాన కార్యదర్శి ఎండి.లాల్ మహమ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి శంకర్, జిల్లా ఆర్థిక కార్యదర్శి సుబ్బారావు, రాజు,శ్రీనివాస్ పాల్గొన్నారు.