10-04-2025 06:37:27 PM
రాజేందర్ కు ఘన సన్మానం..
మందమర్రి (విజయక్రాంతి): ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్(ఏఐసిడబ్ల్యూఎఫ్) జాతీయ కార్యదర్శి(ఆఫీస్ బేరర్) గా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ కార్యదర్శిగా కొనసాగుతున్న అల్లి రాజేందర్ ఎంపిక కావడం హర్షణీయమని యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు సాంబారు వెంకటస్వామి అన్నారు. గురువారం ఏరియా లోని సింగరేణి సివిల్ విభాగం కార్యాలయంలో సివిల్ విభాగం సిఐటియు, ఐఎన్టియుసి యూనియన్ నాయకులు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంయుక్తంగా అల్లి రాజేందర్ కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, మిఠాయిలు పంచి, శుభాకాంక్షలు తెలుపుతూ, జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు వెంకట స్వామి మాట్లాడుతూ... ఏఐసిడబ్ల్యూఎఫ్ 11వ మహాసభలు జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో నిర్వహించగా, సింగరేణి నుండి తుమ్మల రాజారెడ్డి జాతీయ ఉపాధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా మంద నరసింహారావుతో పాటు అల్లి రాజేందర్ జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారనీ అన్నారు. యూనియన్ సివిల్ విభాగం పిట్ కార్యదర్శి ఏ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. అల్లి రాజేందర్ సమస్యలపై తనకున్న అవగాహన మేరకు అందరిని చైతన్య చేయడంలో ఎప్పుడు ముందుంటారని, సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా ఒక సాధారణ కార్మికుడిగా తన పని తను చేసుకుంటూనే, సమస్యలపై యాజమాన్యంపై పోరాడుతారని, అలాంటి వ్యక్తి జాతీయ కార్యదర్శిగా ఎన్నిక కావడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. సిఐటియు యూనియన్ యువతకు ప్రాధాన్యత కల్పించడంలో ముందుంటుందని అనేందుకు ఇదే నిదర్శనమని తెలిపారు.
అనంతరం ఐఎన్టియుసి సివిల్ విభాగం పిట్ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ... తనకు అల్లి రాజేందర్ కు మంచి అనుబంధం ఉందని, యూనియన్ల భేదభావం లేకుండా, ఎవరు ఏది అడిగినా కాదనకుండా సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో అందరికీ తెలియజేస్తాడని తెలిపారు. అందరితో కలిసి ఉంటూ, కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆన్నారు. రాజేందర్ విధుల్లో చేరినప్పటి నుండే కష్టపడి పని చేసే మనస్తత్వం కలవాడని, ఆయన వ్యక్తిత్వమే నేడు ఆయనకు సిఐటియు యూనియన్ లో తగిన గుర్తింపు తేచ్చిందని అభిప్రాయపడ్డారు.
అనంతరం సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ... రాజేందర్ తన దగ్గరికి వచ్చే కార్మికులు కాంట్రాక్ట్, పర్మినెంట్ కార్మికులనే తేడా లేకుండా అందరితో ఒకే విధంగా ప్రవర్తిస్తూ, కలిసిమెలిసి ఉంటారన్నారు. ఆయన భవిష్యత్తులోనూ పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సివిల్ విభాగం యూనియన్ గౌరవ అధ్యక్షుడు సత్తయ్య, అధ్యక్షులు బి మహేందర్, ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి బి కుమారస్వామి, ఆర్గనైజర్ రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్, శంకర్, ఐఎన్టియుసి అసిస్టెంట్ పిట్ కార్యదర్శి గట్టు నరసయ్య, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.