గల్ఫ్ కార్మికుల బాధలపై స్పందించిన కేటీఆర్
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): గల్ఫ్ కార్మికుల కష్టాలు చూస్తే గుండె తరుక్కుపోతుందని, అక్కడ నివసిస్తున్న వారి పరిస్థితులు గుర్తుకొస్తే ఎంతో బాధ కలుగుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు అన్నారు. గతంలో గల్ఫ్ కార్మికుల కోసం పాలసీ తేవాలని ప్రయత్నం చేశామని, టామ్ కామ్ సంస్థ ద్వారా కొంత ప్రయ త్నం చేశామన్నారు. ఆదివారం ప్రసాద్ ల్యాబ్‌లో ‘మేక బతుకు’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ... వలస ఎంత వాస్తవమో, వలసలో దోపిడీ కూడా అంతే వాస్తవమని, అది దుబాయ్ అయినా హైదరాబాద్ అయినా కానీ అదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దూరు వలస కార్మికుల కోసం దుబాయ్‌లోని జైలుకు వెళ్లి కలిసి వచ్చానని, వారిని విడిపించేందుకు అనేక ప్రయత్నాలు చేసి సంవత్సరాల తరువాత చివరికి భారత్ తీసుకురాగలిగామని తెలిపారు. గతంలో సుష్మ స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్‌కు జరుగుతున్న మహిళల అక్రమణ రవాణాపై చర్చించారని, ఆదిశగా దానికి అడ్డుకట్ట వేసేందుకు నేటి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.