ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య..
భద్రాచలంలో ఘనంగా ప్రారంభమైన పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్..
భద్రాచలం (విజయక్రాంతి): దేశంలో తాడిత, పీడిత, ఆదివాసీ అట్టడుగు పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న ప్రజాస్వామిక వాదులను, కవులు, కళాకారులు, విప్లవ కమ్యూనిస్టులను నక్సలైట్ల పేరిట భౌతికంగా నిర్మూలించాలనుకోవడం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ రాక్షస మూర్ఖత్వపు చర్యలకు నిదర్శనాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. మంగళవారం భద్రాచలం పట్టణంలోనీ బత్తుల నగర్ లో పి.డి.ఎస్.యు. (ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత) తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఘనంగా ప్రారంభమైనాయి. ఈ జనరల్ కౌన్సిల్ ను ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మతోన్మాద ఫాసిజాన్ని పెంచి పోషిస్తూ, దేశ సంపదను అంబానీ, ఆదాని, టాటా, బిర్లా లాంటి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ పేద, మధ్యతరగతి ప్రజల అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో మతోన్మాద కుంపట్లు రాజేసేందుకే విద్య రంగాన్ని కాషాయీకరిస్తున్నదని, కుల, మత, భాషాధిపత్యాలను పునరుద్దించేందుకు విద్యారంగంలో సంస్కరణలు తీసుకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన జాతీయ విద్యా విధానం 2020 దేశ లౌకిక, ప్రజాస్వామ్య, సమానత్వ స్ఫూర్తికి విరుద్ధమైనదని అన్నారు. దేశంలో 30 కోట్ల మంది చదువులు పూర్తిచేసుకున్న విద్యార్థి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. దేశంలోని ప్రజల సామాజిక, ఆర్థిక, జీవన స్థితిగతుల్లో సమానత్వాన్ని తీసుకురాకుండా దేశంలో నక్సలిజాన్ని రూపుమాపడం మోడీ, అమిత్ షా ల తరం కాదని తెలిపారు. ప్రభుత్వాలకు ప్రజల అభివృద్ధి పట్ల ఏమాత్రం ప్రేమ, చిత్తశుద్ధి ఉన్న అందరికీ ఉచిత విద్య, వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు. నేటి విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని దోపిడి, పీడన, కుల, మత, అణిచివేత లేని సమానత్వ సమాజ స్థాపన కోసం జరిగే ప్రజా పోరాటాల్లో క్రియాశీలక భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మొదటి రోజు "మతోన్మాద ఫాసిజం-విద్యారంగంపై దాని ప్రభావం" అనే క్లాసును విద్యా పరిరక్షణ కమిటీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు రమేష్ పట్నాయక్ బోధించారు. "భారత జాతీయోద్యమంలో విప్లవ విద్యార్థుల పాత్ర" అనే క్లాసును పి.డి.ఎస్.యు. మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల అశోక్ బోధించారు. జనరల్ కౌన్సిల్ ప్రారంభానికి ముందు పి.డి.ఎస్.యు. రాష్ట్ర అధ్యక్షులు పెద్దింటి రామకృష్ణ బిగిపిడికిలి జెండాను ఆవిష్కరించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ విప్లవ విద్యార్థి అమరవీరులను స్మరిస్తూ సంతాప తీర్మానం ప్రవేశపెట్టి, ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కెచ్చల రంగారెడ్డి, హన్మేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ముద్ద భిక్షం, పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నరసింహారావు, కాంపాటి పృద్వి, ఎస్. అనిల్, నరేందర్, భాస్కర్, రాష్ట్ర సహాయ కార్యదర్శిలు అఖిల్, ప్రవీణ్, సాయి, కోశాధికారి సురేష్, రాష్ట్ర నాయకులు నరేందర్, వెంకటేష్, సీతారాం, అజయ్, సంధ్య, కావ్య, రాకేష్, మహేందర్, భద్రాచలం డివిజన్ కార్యదర్శి శివ తదితరులు పాల్గొన్నారు.