calender_icon.png 4 October, 2024 | 6:51 PM

నైతిక విలువలు కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత

04-10-2024 03:36:53 PM

జామయితే ఇస్లామి హింద్ సంస్థ తెలంగాణ అధ్యక్షులు 

సిద్దిపేట (విజయక్రాంతి): నైతిక విలువలు కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జామాయితే ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షుడు డా, ఖలేద్ ముబషీర్ ఉజ్ జఫర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. జమాత్-ఎ-ఇస్లామీ హింద్ భారతదేశంలో 75 సంవత్సరాలుగా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. నిరుపేదలకు, వితంతువులకు ఆర్థిక సహాయం అందించడం, అనాథలు, నిరాశ్రయులైన పిల్లలకు విద్యా సహాయం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందన్నారు.తెలంగాణలో మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులను, క్లినిక్ లను నిర్వహిస్తూ  పేదలకు ఉచితంగా వైద్యసేవలు కూడా అందిస్తోందని తెలిపారు.

ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు సామాజిక రుగ్మాతలను నిర్మూలించడానికి, ఆధ్యాత్మిక, ధార్మిక, నైతిక విలువలను ప్రోత్సహించడానికి, సమాజంలో శాంతి సామరస్యాలను పెంపొందించడానికి జమాత్ పనిచేస్తోందన్నారు. సామాజిక సమానత్వం కోసం, ముఖ్యంగా అణగారిన, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. మెరుగైన పాలన కోసం తెలంగాణ ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని జమాత్ భావిస్తోందని మైనారిటీలకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశిస్తున్నమ్మన్నారు. కాని వివిధ ప్రభుత్వ సంస్థలలో ముస్లిం ప్రాతినిధ్యం లేకపోవడం, దిగజారుతున్న శాంతిభద్రతలు, పెరుగుతున్న నిరుద్యోగం వంటి కీలక సమస్యలపై తక్షణమే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ (సవరణ) బిల్లు పై జమాత్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసిందన్నారు. ఈ బిల్లు వక్ఫ్ ఆస్తుల స్వయంప్రతిపత్తిని, నిర్వహణను దెబ్బతీస్తుందని, ఈ బిల్లు మైనారిటీలకు రాజ్యాంగం ఇచ్చిన హామీలకు విరుద్దమని, దేశవ్యాప్తంగా వక్ఫ్ సంస్థల హక్కులను ఈ బిల్లు దెబ్బతీసే అవకాశం ఉందని జమాత్ భావిస్తోందన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దృఢవైఖరి తీసుకోవాలని జమాత్ కోరుతోందన్నారు. ఇటీవల హైదరాబాదులో చెరువులను పూడ్చి అక్రమంగా కట్టిన నిర్మాణాలను లక్ష్యంగా చేసుకున్నామంటూ ‘‘హైడ్రా’’ నిర్వహిస్తున్న కూల్చివేతలపై ప్రజల్లో తీవ్ర నిరసన ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని, చెరువులు, నాలాలు, జలాశయాలు, ప్రభుత్వ ఆస్తలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇది బాధ్యతేకాదు కర్తవ్యం కూడా కానీ, పేదలు, సాధారణ ప్రజల పట్ల ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలన్నారు. మెదక్ లో మతోన్మాదశక్తులు రెచ్చిపోయిన సంఘటనలు, మతఉద్రిక్తల తర్వాత ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్లో ముస్లింల వ్యాపారాలు, ఆస్తులపై, మస్జీద్ లపై దాడులు జరిగాయని, పవిత్ర ఖురాణ్ పట్ల అపచారం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి మతోన్మాద సంఘటనలను అడ్డుకోవాలని, శాంతి, సామరస్యాన్ని నెలకొల్పాలని,  తెలంగాణ పోలీసులు సత్వర చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జమాత్ కోరుతోందన్నారు. ఇటీవల ఖమ్మం లో సంభవించిన వరద కారణంగా చాల ఆస్తి, ప్రాణనష్టాలు జరిగాయని ఖమ్మం లో జమాఅత్ రంగంలోకి దిగి,  భారీ వర్షాల వల్ల వరదల వల్ల ప్రభావితులైన బాధితుల సహాయానికి, పునరావాసానికి చురుకుగా స్వచ్ఛంద కార్యక్రమాలను ప్రారంభించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పైన పేర్కొన్న సమస్యలపై తక్షణం దృష్టిపెట్టాలని జమాఅత్ కోరుతోందన్నారు. పాత్రికేయులు మెరుగైన సమాజ నిర్మాణానికి పనిచేయాలని, మత సామరస్యానికి భంగం కలిగించే నకిలీ వార్తలు, పుకార్లను అడ్డుకోవాలని విజ్ఞప్తి  చేస్తోందన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శలు మొహమ్మద్ నయీమోద్దీన్ అహ్మద్,మొహమ్మద్ అలీమోద్దీన్ ఇర్షాద్, మీర్ జఫరూల్లా తహర్, అబ్దుల్  ఖుద్ధుస్ తదితరులు పాల్గొన్నారు.