25-03-2025 05:00:34 PM
కొత్త కిషోర్ కుమార్..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలకు రుణం తీర్చుకోవడం తన అదృష్టమని అప్పటి యుపిఎస్ ఇప్పటి జడ్పీహెచ్ఎస్ పాఠశాల పూర్వ విద్యార్థి కొత్త కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో తను చదువుకున్న పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యాలు లేవని పాఠశాల హెచ్ఎం సునంద తన దృష్టికి తేవడంతో వారి తాత కీర్తిశేషులు వొజ్జల చంద్రమౌళి జ్ఞాపకార్థంగా 54 వేల రూపాయలతో టేబుల్లు, బీరువాలు, బ్లాక్ బోర్డులు అందించారు. ఈ సందర్భంగా కొత్త కిషోర్ కుమార్ మాట్లాడుతూ... తాను ఈ పాఠశాలలో చదువుకొని జెపి మోర్గాన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నానని తన చిన్ననాటి పాఠశాలలో సౌకర్యాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.
కొంత మంది విద్యార్థులతో మాట్లాడిన ఆయన వారి అభిరుచులను కనుక్కొని తన సహ విద్యార్థులతో చర్చించి మరింత సహాయం అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఇద్దరు విద్యార్థులతో మాట్లాడిన అనంతరం వారు టెన్త్ క్లాస్ లో 10 జీపీఏ పొందుతామని హామీ ఇవ్వడంతో వారికి తగిన బహుమతి ఇస్తానని ఈ వాగ్దానం చేశారు. అనంతరం పాఠశాల హెచ్ఎం సునంద మాట్లాడుతూ.. ఎప్పుడో చదువుకున్న ఇప్పటివరకు గుర్తుంచుకొని విద్యార్థుల కోసం పలు వస్తువులు అందించడం ఆనందం కలిగించే విషయం అన్నారు. కిషోర్ కుమార్ ను ఆదర్శంగా తీసుకొని మరింత మంది పూర్వ విద్యార్థులు పాఠశాలకు సాయం చేసి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడాలన్నారు.
గతంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాఠశాల సమస్యలు దృష్టికి తేగా కిషోర్ కుమార్ స్పందించి 54 వేల రూపాయలు తాను ఇస్తానని అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకోమని చెప్పారన్నారు. అందులోని ప్రతి పైసా విద్యార్థుల అభివృద్ధి కోసం అవసరమయ్యే వస్తువులు కొనుగోలు చేశానన్నారు. ఈ సందర్భంగా దాత కొత్త కిషోర్ కుమార్ కు పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కే రవీందర్, సుజాత, మాయ, వసంత, సంపూర్ణ, రామ్మోహన్ రెడ్డి, సరిత, స్వప్న పూర్వ విద్యార్థి బృందం నలినీకాంత్, దిగంబర్, శిరీష్, రమేష్, జగదీష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.