13-04-2025 12:00:00 AM
-తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి
ముషీరాబాద్, ఏప్రిల్ 12 (విజయ క్రాంతి) : బాలల కోసం పుస్తకాలు నడపడం అభినందనీయమని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాలల కోసం గత పదేళ్ల నుండి సీనియర్ జర్నలిస్టు వేదాంత సూరి ఆధ్వర్యంలో వెలువడుతున్న ’మొలక’ ఏప్రిల్ మాస పుస్తకాన్ని శనివారం సాయంత్రం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం అయన మాట్లాడు తూ తాను బాల్యంలో ఉన్నప్పుడు పావలా అర్ధరూపాయి పెట్టి చందమామ, బాలమిత్ర పుస్తకాలు పోస్టులో తెప్పించుకొని చదువుకునేవాళ్లం అన్నారు.
మొలకను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి అభివృద్ధిలోకి తీసుకురావాలన్నారు. పత్రికకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. టీయూ డబ్ల్యూజే అధ్యక్షులు విరహత్ అలీ మాట్లాడు తూ పదేళ్ల నుండి మొలక పిల్లల కోసం రావడం హర్షించదగ్గ విషయమన్నారు. మొలక ముఖచిత్రానికి బాల ప్రతిని ధిగా ఇంటర్వ్యూ చేసిన చిరంజీవి ఆశ్రితను సన్మానించి మెమొంటోతో అభినందించారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే స్టేట్ జనరల్ సెక్రెటరీ రాం నారాయణ, రాష్ట్ర నాయకులు వెంకటరెడ్డి, నరేందర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్ చారి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జనార్ధన్, ప్రిన్సిపల్ రమణమ్మ మొలక ప్రత్యేక ప్రతినిధి కేవీఎం వెంకట్, పెద్దెముల్ మండల మాజీ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.