calender_icon.png 5 December, 2024 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు రాష్ట్రస్థాయిలో రాణించడం అభినందనీయం

03-12-2024 07:17:35 PM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని తన  ఛాంబర్ లో పోటీలలో గెలుపొందిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 29, 30, ఈ నెల 1 తేదీలలో అర్పూర్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో భాగంగా మంచిర్యాలలో 8, 10, 12 సంవత్సరాల విభాగంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో జిల్లా గిరిజన క్రీడా పాఠశాల విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని విజేతగా నిలిచారని తెలిపారు. విద్యార్థులు చదువుతూ పాటు క్రీడారంగంలో రాణించాలని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి మీనారెడ్డి, శిక్షకులు రవి సాగర్, విద్యార్థులు పాల్గొన్నారు.

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది : కలెక్టర్ వెంకటేష్ దోత్రే

దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని  కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్ తో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటుందని, దివ్యాంగుల సమస్యలపై జిల్లా అధికారులు, దివ్యాంగులతో సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో దివ్యంగా పింఛన్లపై ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి అందిన దరఖాస్తులపై వెంటనే స్పందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో దివ్యాంగులకు కల్పించవలసిన పనులపై చర్యలు తీసుకుంటామని, దివ్యాంగుల ఉపాధి కొరకు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలింకో సంస్థ వారితో మాట్లాడి అర్హులైన దివ్యాంగులకు ట్రై సైకిల్ మంజూరుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అంగవైకల్యం దేనికి అడ్డు కాదని, సంకల్పం, పట్టుదల, మనోధైర్యం ఉంటే అన్ని రంగాలలో రాణించవచ్చని, ప్రభుత్వం ఆ దిశగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ అలీబిన్ అహ్మద్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ, దివ్యాంగుల సంఘం సభ్యులు వెంకటేష్, సద్దాం ఖయ్యూం, రవిశంకర్, స్వరూప, దివ్యాంగులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.