అందరినోటా అదే మాటా
మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు
వరదల సమయంలో సాయమూ అందట్లేదు
ఏపీలో విలీనమైన 5 గ్రామాల ప్రజలు
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 5 (విజయక్రాంతి): ఆంధ్రలో కలిపిన 5 పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. 10 ఏళ్లుగా అభివృద్దికి నోచుకోక, అడుగడుగునా తీవ్ర అవాంతరాలను ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నామని, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు తమ సమస్యలను ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను పోలవరం ముంపు ప్రాంతాల పేరుతో ఆంధ్రలో విలీనం చేశారు. దీనిలో భాగంగా ముంపు ప్రాంతంలో లేని కన్యాయిగూడెం, పిచుకులపాడు, ఎటపాక, గుండాల, పురుషోత్తంపట్నం పంచాయతీలను సైతం ఏపీలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. అదే వారి పాలిట శాపంగా మారింది. దీంతో భద్రాచలం పట్టణవాసులతో పాటు, విలీనమైన ఐదు పంచాయతీల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భధ్రాచలం పట్టణానికి కనీసం చెత్తవేయడానికి కూడా స్థలం లేక గోదావరి నదీతీరాన డంప్ చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పవచ్చు.
ఈ 5 గ్రామాల ప్రజలు వందల కిలోమీటర్లు ప్రయాణించి అల్లూరి సీతారామరాజు జిల్లాకు వెళ్లి సమస్యలు విన్నవించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలు, పర్ణశాలకు వెళ్లాలంటే 7 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో ప్రయాణించి తిరిగి తెలంగాణలోని దుమ్ముగూడెం మండలానికి రావాల్సి ఉంటుంది. రోజూ ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలకు సరిహద్దు సమస్యలు ఇబ్బందిగా మారాయి. తెలంగాణలో పండించిన పంటలతో పాటు అన్ని రకాల వస్తువులు భద్రాచలం మార్కెట్‌లో అమ్ముకోవడానికి ఇదొక్కటే మార్గం. దీంతో రోడ్డు వెంట వస్తున్న వాహనాలను ఆంధ్రప్రాంత అధికారులు ఆపి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. విభజన సమయంలో వాస్తవ స్థితిగతులు పరిశీలించకుండా ఢిల్లీస్థాయిలో అధికారులు గెజిట్ ద్వారా విభజించడంతో ఈ దుర్భర పరిస్థితి నెలకొంది.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఐదు పంచాయతీల విలీన విషయాన్ని అజెండాగా ఎంచుకొని ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టోలో సైతం పొందుపర్చారు. గతంలో అంధ్రాలో అధికారంలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ఈ గ్రామాలను వదులకోవడానికి నిరాకరించడంతో ఐదేళ్ల పాటు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తిరిగి ఆంధ్రలో చంద్రబాబు అధికారంలోకి రావడంతో ప్రజల్లో ఆశలు చిగురించాయి. దీనికి తోడు ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం కలవనున్న నేపథ్యంలో గ్రామాల విలీనం సులభతరం అవుతుందని ప్రజలు కొండంత ఆశతో ఉన్నారు. తాజాగా ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ప్రధాని మోదీతో ఈ గ్రామాల ప్రస్తావన తీసుకొచ్చి తెలంగాణలో కలపాలని కోరిన విషయం విధితమే. భద్రాచలంతో పాటు ఐదు గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో విలీనం చేయాలని కోరుతున్నారు.
దేవాలయ భూములకు రక్షణ కరువు
రాష్ట్ర విభజనలో భాగంగా పురుషోత్తంపట్నం ఆంధ్రలో విలీనం కావడంతో భద్రాచలం రామాలయం మాన్యంగా ఇచ్చిన 889 ఎకరాల భూములు ఏపీకి వెళ్లాయి. దీంతో స్వామివారి ఆస్తులకూ రక్షణ కరువైంది. ఆ భూముల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే అక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులు అడ్డుకొంటున్నారు. మరోవైపు ఆక్రమణలు చోటు చేసుకొంటున్నాయి. ఈ పరిస్థితిలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల 6వ తేదీన ప్రజాభవన్‌లో భేటీ కానున్నారు. స్వామివారి ఆస్తులకు రక్షణ కావాలన్నా, ఐదు పంచాయతీల ప్రజల కష్టాలు తీరాలన్నా అవి తెలంగాణలో విలీనం కావడమే మార్గమని ప్రజలు భావిస్తున్నారు.
విద్యా, వైద్యానికి దూరమయ్యాం
కేంద్రం ఆనాడు తీసుకొన్న ఏకపక్ష నిర్ణయంతో భద్రాచలం సమీ పంలోని 5 గ్రామాల ప్రజలు విద్య, వైద్యానికి దూరమయ్యారు. కనీస మౌలిక వసతులకు నోచుకోలేక పోతున్నాం. ఏపీకి చివర ఉండటం వల్ల ఆ పాలకుల దృష్టి తమ ప్రాంతాలపై లేదు. తెలంగాణ భద్రాచలానికి ఆనుకొని ఉన్న తమ ప్రాంత ప్రజలు వరదల సమయంలో భద్రాచలంలో తల దాచుకోవాల్సి వస్తుంది. పంట అమ్మాలన్నా ఏపీ నుంచి సహాయం అందటంలేదు. 5 పంచాయతీలను తెలంగాణలోని భద్రాచలంలో కలిపితే తప్ప మనుగడ లేదు.
మువ్వా శ్రీనివాస్
వరదలతో ఇబ్బందులు
ఏటా జూలై, ఆగస్టులో గోదావరి వరదలతో ఇబ్బందులు పడుతున్నాం. ఏపీ అధికారులు పట్టించుకోరు. తప్పని పరిస్థితిలో తెలంగాణలో తల దాచుకోవాలి. ఒకవైపు అబివృద్ధికి నోచుకోక, మరోవైపు వరద సాయం అందక, మౌలిక సదుపాయాలకు దూరమై దుర్భర జీవనం గడుపుతున్నాం. నేడు ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి మా సమస్యను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నక్కా వెంకన్న (పిచుకలపాడు)
ఏపీ అధికారులతో ఇబ్బందులు
పదేళ్లుగా రాకపోకల సమయంలో ఏపీ అధికారులతో నానా తంటాలు పడాల్సి వస్తోంది. రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద నిత్యం ఇబ్బందులే. భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఈ 5 గ్రామాల ప్రజలు ఏ చిన్న పనిఉన్నా భద్రాచలం వెళ్లాల్సిందే. ఇటు వచ్చేందుకు ఒకే మార్గం ఉంది. దీంతో చెక్‌పోస్టు వద్ద ఇబ్బందులు పడుతున్నాం. దూరప్రాంతాలకు వెళ్లలేక పక్కనే ఉన్న తెలంగాణకు రావాల్సి వస్తుంది. తెలంగాణలో విలీనం చేస్తేనే మాకు విముక్తి.
రవికుమార్ (మాజీ జెడ్పీటీసీ కన్నాయిగూడెం)