13-04-2025 12:44:13 AM
గర్భిణిగా ఉన్నప్పుడు కొంతమందిలో కటి వలయ కండరాలు పట్టేస్తుంటాయి. పాదాల్లో నీరు చేరి వాపులొస్తుంటాయి. రోజురోజుకీ పొట్ట పెరిగి పోవడంతో నిల్చున్నా, కూర్చున్నా ఆయాసపడుతుంటారు.. ఇలాంటి వారికి విపరీత కరణి యోగాసనం మంచిది.
ఈఆసనం వేయడానికి గర్భిణులే కాదు.. ఇతరులూ ఈ ఆసనం సాధన చేయవచ్చు. అయితే సాధన చేసేటప్పుడు కచ్చితంగా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం క్షేమం. ‘విపరీత కరణి’ యోగాసనం వేసేటప్పుడు యోగా మ్యాట్‌ను గోడకు చేరువగా వేసుకుని దానిపై వెల్లకిలా పడుకోవాలి. గర్భిణులు నడుం భాగంలో సపోర్ట్ కోసం దిండు లేదా కుషన్ వంటివి పెట్టుకోవాలి. ఇప్పుడు కాళ్లను నిటారుగా పైకి లేపి గోడకు ఆనించాలి. చూడ్డానికి ఎల్ షేప్‌లో కనిపించే ఈ భంగిమలో నాడీ వ్యవస్థను దృఢం చేయడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. ఒత్తిడినీ దూరం చేస్తుంది ఈ యోగాసనం.
ఉదయం పూట చేస్తే..
కేంద్ర నాడీ వ్యవస్థలోని గ్లింఫాటిక్ వ్యవస్థల పనితీరును మెరుగుపరిచి.. తద్వారా రోగనిరోధక శక్తి పెంపొందించేందుకు ఈ ఆసనం సహకరిస్తుంది.
శరీరంలోని మలినాలు తొలగిపోతాయి.
తుంటి, తొడ కండరాలు దృఢమై.. అవి ఫ్లెక్సిబుల్‌గా మారతాయి.
ఈ ఆసనం వల్ల కటి వలయ కండరాలకు, ప్రత్యుత్పత్తి వ్యవస్థకు రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. తద్వారా ప్రత్యుత్పత్తి సమస్యలు రాకుండా జాగ్రత్తపడచ్చు.
ఈ ఆసనం వేసినప్పుడు శరీరానికి వ్యతిరేక దిశలో ఒత్తిడి తగలడం వల్ల థైరాయిడ్ గ్రంథికి రక్తప్రసరణ చక్కగా అందుతుంది. ఫలితం హైపో/హైపర్ థైరాయిడ్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ప్రత్యుత్పత్తి వ్యవస్థకు రక్తప్రసరణ బాగా జరిగి నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది యోగాసనం.
తలనొప్పిని తగ్గించుకోవాలాన్నా, శరీరాన్ని పునరుత్తేజితం చేసుకోవాలన్నా ఈ ఆసనం చక్కటి మార్గం అంటున్నారు నిపుణులు.
రోజుకు ఐదు నిమిషాలు
ఆయాసం తగ్గుతుంది.
పాదాల్లో నీరు చేరి వాపు రాకుండా జాగ్రత్తపడచ్చు.
కండరాలు, కీళ్లలో ఫ్లెక్సిబులిటీ పెరుగుతుంది.
పొట్ట పెరిగే కొద్దీ వెన్నెముక, వీపుపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడచ్చు.
శరీరం నీటిని నిలుపుకోవడాన్ని తగ్గిస్తుంది. తద్వారా శరీరం ఉబ్బినట్లుగా కనిపించదు.
- సీకుర్తి సంధ్య రెడ్డి, ఎస్‌ఎస్‌ఆర్ హ్యాపీ ఫిట్‌నెస్ ట్రైనింగ్ స్టూడియో,హైదరాబాద్