29-03-2025 05:35:21 PM
ఉద్యమంలో పాల్గొన్న కళాకారులను ఆదుకోవాలి..
సిద్దిపేట: నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని అసెంబ్లీలో సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, శాసనమండలిలో ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డిలు మాట్లాడడం సంతోషకరమని నిరుద్యోగ కళాకారుల సంఘం నాయకులు పిన్నింటి దాసు, కుంచం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరుద్యోగ కళాకారుల సంఘం నాయకులు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజా గొంతుకలై పాడిన కళాకారులకు చాలామందికి నేటికీ ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.
ఈ విషయాన్ని గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ వెన్నెల దృష్టికి తీసుకెల్లామని తెలిపారు. ప్రభుత్వం నిరుద్యోగ కళాకారులను ఆదుకుంటుందని తమకు తప్పకుండా ఉద్యోగాలు కల్పిస్తుంది అనే నమ్మకం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు కల్పించాలని... లేనిపక్షంలో రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలకు సైతం సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ కళాకారుల సంఘం నాయకులు విదుమౌళి,మురళీ, ఐలయ్య పలువురు పాల్గొన్నారు.