పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం (నేడు) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల గురువారం మీడియాతో ముచ్చటించి, సినిమా విశేషాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... “కథ విన్నాక ఈ చిత్రంలో తప్పకుండా నా పేరు కనిపించాలనుకున్నాను. ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకుంటున్న టైమ్‌లో అంకిత్ ద్వారా ఈ కథ నా దగ్గరకొచ్చింది. సిటీలో పుట్టి పెరిగిన నేను జాతర ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. కానీ నాకు కళ్లకు కట్టినట్టుగా వంశీ చూపించాడు.
నాకు కమిటీ కుర్రోళ్లు అంటే ఏంటో తెలియదు.. పండుగలు, పబ్బాలు, గొడవలు ఇలా ఏది ఉన్నా కమిటీ కుర్రాళ్లే ముందుంటారని వంశీ చెప్పారు (నవ్వుతూ). వంశీ పవన్ కళ్యాణ్ అభిమాని. 2019 ఎన్నికల ప్రచారంలో జరిగిన విషయాలను కూడా ఇందులో కాస్త సెటైరికల్‌గా చూపించారాయన. ‘ముద్దపప్పు ఆవకాయ’లో నేను నటించాను. ఆ టైమ్‌లో నేను డబ్బులు కూడా పెట్టాను. అదే ప్రొడక్షన్ హౌస్ అయింది.. అలా నిర్మాతగా మారిపోయానంతే! కానీ, నాకు నటించడమే ఇష్టం. పదకొండు మంది అబ్బాయిల కారెక్టర్లలో నన్ను నేను ఊహించుకున్నాను. ప్రతి ఒక్కరూ సినిమాకు అలాగే కనెక్ట్ అవుతారు.
టాలెంట్ మాత్రమే కాదు.. క్రమశిక్షణ ఉంటేనే ఇండస్ట్రీలో ఎదుగుతారని చిరంజీవి చెబుతుంటారు. ఆ క్రమశిక్షణ నేను వంశీలో చూశాను. మంచి కథలు, కాన్సెప్ట్‌లు, స్క్రిప్ట్‌లకే ప్రాధాన్యం ఇస్తా. పాత్ర బాగుంటే మిగతా అంశాల గురించి అంతగా పట్టించుకోను. నచ్చితే నటిస్తాను. వారసత్వం ఉంది కదా అని సినిమాల్లోకి వస్తే సక్సెస్ అవ్వలేరు. సినిమా అంటే ప్యాషన్, ఇష్టం ఉండాలి. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడాలి. అప్పుడే విజయం సాధించగలుగుతారు.