ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది: మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్,సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): కేన్స్ టెక్నాలజీ సంస్థకు చెందిన అత్యంత అధునాతన యూనిట్ తెలంగాణ నుంచి గుజరాత్‌కు తరలిపోతున్న మాట వాస్తవమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి తన ట్వీట్ తర్వాత సంబంధిత మంత్రి ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేన్స్ రాష్ట్రంలోనే ఉంటుంద న్నట్లుగా ప్రకటన చేశారని విమర్శించారు. రాష్ట్రంలో 3 యూనిట్లను స్థాపించేలా కేన్స్ సంస్థను ఒప్పించి, వారికి అన్ని అనుమతులు ఇచ్చామని తెలిపారు.
ఓ సాధారణ ఎలక్ట్రా నిక్స్ తయారీ యూనిట్‌తో పాటు ఓఎస్‌ఏటీ(ఓస్టా)ను కొంగరకలాన్‌లో ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. మరో యూనిట్ పీసీబీని వరంగల్‌లో ఏర్పాటుచేసేందుకు ఒప్పించామన్నారు. కొంగరకలాన్‌లో ఓఎస్‌ఏటీ ని ఏర్పాటు చేసిఉంటే సెమీ కండక్టర్ల రంగానికి హైదరాబాద్‌లో మంచి భవిష్యత్ ఉండేదన్నారు. ఇప్పటికైనా కేన్స్ పెట్టుబడుల విషయంలో ప్రజల ముందు నిజాలను వెల్లడించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.