18-04-2025 12:11:39 AM
-జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర
చిన్న చింతకుంట ఏప్రిల్ 17 : నేరం జరుగుతున్నప్పుడు చూసి తనకెందుకులే అని నిజం చెప్పకపోయినా నేరస్థులే అవుతారని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు చైల్ ఫ్రెండ్లీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని ఐకెపి సమావేశ మందిరంలో మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ రాజ్యాంగంలో కల్పించిన ప్రాథమిక హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, బాలల రక్షణ సంరక్షణ పై నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ఒక నేరం జరిగినప్పుడు స్వయంగా చూసినా, తెలిసినా కచ్చితంగా సాక్ష్యం చెప్పాలని, తద్వారా నేరస్తుడికి శిక్ష పడుతుందని అన్నారు. నేరాల అదుపునకు చట్టాల తో పాటు బాధ్యతలు కూడా అంతే ముఖ్యమని అన్నారు. బాల్యవివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల చట్టాలు వంటి అంశాలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
స్నేహపూర్వకమైన బాలల న్యాయ సేవల పథకం-2024 ప్రకారం బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి కలలను సాకారం చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకోవాలని సూచించారు. వేసవి సెలవుల్లో బాల్యవివాహాలు చేసేందుకు తల్లిదండ్రులు గాని, బంధువులు గానీ ప్రయత్నిస్తే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థకు గాని, స్థానిక పోలీసులకు 100కు ఫోన్ చేసి గాని, చైల్ లైన్ 1098కు ఫోన్ చేసి గాని వివరాలు చెబితే వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు.
ఉచిత న్యాయ సహాయంతో పాటు బాలలు, మహిళలకు ప్రాథమిక హక్కులను తెలియజేసేందుకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ పనిచేస్తుందని అన్నారు. బాలల రక్షణ, సంరక్షణపై ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ బడిలో ఉండాలని సూచించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాల నిర్మూలన, చైల్ ప్రొటెక్షన్ వంటి కార్యక్రమాలపై సమాజ శ్రేయస్సు కోరుకునే ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు.
పిల్లల హక్కులకు భంగం కలగకుండా వారికి సహాయం చేసేందుకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో చైల్ ఫ్రెండ్లీ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై అవగాహన కల్పించారు.పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకొని చదువుపై శ్రద్ధ చూపేలా కౌన్సిలింగ్ ఇవ్వడం బాధ్యతగా తీసుకోవాలని టీచర్లకు సూచించారు.
ఈ కార్యక్రమాల్లో తహసిల్దార్ ఎల్లయ్య, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, ఎస్త్స్ర రామ్ లాల్ నాయక్, ఏపిఎం విష్ణు చారి, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పద్మమ్మ, కేజీబీవీ ప్రిన్సిపాల్ హేమలత, ప్యారా లీగల్ వాలంటీర్ పి.యాదయ్య తదితరులు పాల్గొన్నారు.