calender_icon.png 23 October, 2024 | 7:01 AM

ఇది సామాన్యురాలి విజయం

18-06-2024 12:05:00 AM

సంజనా జాతవ్.. 18వ లోక్ సభకు ఎన్నికైన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచిన ఎంపీల్లో ఈమె కూడా ఒకరు. ఓ కానిస్టేబుల్ భార్యగా.. అత్యంత సామాన్యురాలికి దక్కిన నిజమైన విజయం ఇది. వార్డు మెంజర్‌గా గెలిచి తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన 26 ఏళ్ల సంజన.. నిత్యం జనం మధ్యే ఉంటూ.. వారితో మమేకమయ్యారు.. అవే సంజన విజయానికి బాటలు వేశాయి.

కింది స్థాయి నుంచి ఎదిగిన యువ నాయకురాలు సంజనా జాటవ్. రాజస్తాన్‌లోని భరత్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలోకి దిగారు. బీజేపీ సిటింగ్ ఎంపీ రామ్‌స్వరూప్‌పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. సంజనను ఓడించడానికి ప్రత్యర్థులు సర్వశక్తులూ ఒడ్డారు. నియోజకవర్గం మీద పట్టున్న ఆమె, తన వాగ్ధాటితో వాటన్నింటినీ తిప్పి కొట్టారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కార్యకర్త స్థాయి నుంచి ఎంపీ వరకు అత్యంత వేగంగా ఎదిగిన నాయకురాలు సంజన.

‘నియోజకవర్గంలో పెచ్చుమీరుతున్న నేరాలు, నిరుద్యోగం, నీటి కొరత, విద్యుత్ అంతరాయాలు, అధ్వానమైన రోడ్లు, రైతులకు కనీస మద్దతు ధర లేకపోవడం, ఎరువులు, విత్తనాల కొరత.. ఇలా అడుగడుగునా సమస్యలే. అన్నింటా మా ప్రాంతం వెనకబడిపోయింది. ఈ సమస్యలనే ప్రచార అస్త్రాలుగా ఉపయోగించాను. దానికితోడు మొదటి నుంచీ నాకు ఇక్కడి ప్రజల స్థితిగతులపై పూర్తి అవగాహన ఉంది. నన్ను నమ్మి గెలిపించిన ప్రజలకు అండగా నిలబడతాను’ అంటున్న సంజన బీఏ చదివారు. స్త్రీసాధికారతే లక్ష్యంగా జనంలోకి వెళ్లారు. సంజన భర్త కప్తాన్ సింగ్ పోలీస్ కానిస్టేబుల్. వారికి ఇద్దరు పిల్లలు. స్థానిక ‘గాంధీ జ్యోతీ కాలేజీ’ లో బీఏ చదివిన ఆమె.. ‘లార్డ్స్ యూనివర్సిటీ’ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. అణగారిన వర్గాలు, మహిళల పక్షాన నిలిచి, వారి అభ్యున్నతికి పాటు పడుతున్నారు.