calender_icon.png 19 April, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుప్పాలగూడలో ఐటీ హబ్

18-04-2025 12:18:25 AM

  1. 450 ఎకరాల్లో ఏర్పాటుకు చర్యలు 
  2. 5 లక్షల మందికి ఉపాధి
  3. అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,
  4. మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): పుప్పాలగూడ పరిసరాల్లో సుమారు 450 ఎకరాల్లో మొదటిదశలో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాల యంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి  సీఎస్ శాంతికుమారి, పరిశ్రమలు, రెవెన్యూ శాఖల కీలక అధికారులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పుప్పాలగూడ పరిసరాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ఐఏఎస్ అధికారుల కోసం ప్రభుత్వం గతంలో స్థలాలు కేటాయించిందని, వీరితోపాటు రెవిన్యూ అధికారులు, స్పెషల్ పోలీస్ మ్యూచువల్ కో-ఆపరేటివ్ సొసైటీ తదితర సొసైటీలకు కూడా సుమారు 200 ఎకరాలకు పైగా భూమిని ప్రభుత్వం కేటాయించిందని అధికారులు డిప్యూటీ సీఎం, మంత్రులకు వివరించారు.

పుప్పాలగూడ పరిధిలో సొసైటీలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు మంత్రుల సబ్‌కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ భూమి పక్కనే ఇండస్ట్రీయల్ కార్పొరేషన్‌కు సంబంధించిన సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉన్నట్టు అధికారులు వివరించారు. మొత్తంగా మొదటి దశలో ఐటీ నాలెడ్జ్ హబ్ అభివృద్ధికి సుమారు 450 ఎకరాలు అందుబాటులో ఉందని అధికారులు చెప్పారు.

మొదటిదశలో ఏర్పాటు చేయబోతున్న ఐటీహబ్ ద్వారా 5 లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తోందని అధికారులు మంత్రుల బృందానికి వివరించారు. ‘నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీకి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత నాలెడ్జ్‌హబ్ ఏర్పాటుతో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాల్లో వచ్చిన ప్రతీ మార్పులో హైదరాబాద్ భాగస్వామిగా ఉంది.

ఇప్పుడు సైతం ఐటీరంగంలో ఏఐ టెక్నాలజీలో వేగంగా వస్తున్న మార్పును హైదరాబాద్ అందిపుచ్చుకోవాలి’ అని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్ ఆర్థిక అభివృద్ధిలో సుస్థిర స్థానాన్ని సాధించిన నేపథ్యంలో నగర అభివృద్ధిని అడ్డుకోవడం సాధ్యంకాదని ఆర్థికవేత్తలు స్పష్టం చేసిన విషయాన్ని మంత్రులు చర్చించారు. అభివృద్ధిని కొనసాగించే క్రమంలో పుప్పాలగూడలో 450 ఎకరాల్లో నాలెడ్జ్ హబ్‌ను అభివృద్ధి చేస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న హైదరాబాద్ ప్రగతిని వేగవంతం చేయాలని నిర్ణయించారు.