నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’తో ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదలైంది.
మొదటి షో నుంచే థియేటర్లు కళకళలాడుతున్నాయి. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మూవీటీమ్ ఆదివారం మధ్యాహ్నమే ప్రెస్‌మీట్ నిర్వహించి, సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ‘బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వాలని టీమ్ అందరం ఎంతో కష్టపడ్డాం. బాలకృష్ణ కెరీర్‌లో గొప్ప సినిమాల్లో ఒకటిగా ‘డాకు మహారాజ్’ నిలుస్తుందని గతంలో ఒక ప్రెస్‌మీట్ సందర్భంగా నాగవంశీ అన్నారు.
వంశీ నమ్మకం నిజమై ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి అనేది నాకు మరింత ప్రత్యేకమైన పండుగలా మారిపోయింది. మనసు పెట్టి సినిమా తీస్తే, తెలుగు ప్రేక్షకులు గుండెల్లోకి పెట్టుకుంటారని మరోసారి రుజువైంది. సినిమాకు వస్తున్న స్పందన పట్ల బాలకృష్ణ చాలా హ్యాపీగా ఉన్నారు’ అన్నారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ‘తిరుమల ఘటన నేపథ్యంలో అనంతపురంలో తలపెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేశాం.
అందుకే ఈ వారంలో సక్సెస్ మీట్‌ను అనంతపురంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాం. సినిమా పట్ల బాలకృష్ణ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. సాధారణ ప్రేక్షకులు కూడా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు’ అని చెప్పారు. ‘ఇది నాకు చాలా ప్రత్యేకమైన, ఎప్పటికీ మరచిపోలేని పుట్టినరోజు. నా పుట్టినరోజు నాడు విడుదలైన డాకు మహారాజ్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
ఇంత మంచి సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను’ అని ప్రగ్యా జైస్వాల్ అన్నారు. శ్రద్ధాశ్రీనాథ్ మాట్లాడుతూ.. ‘ఈ సంక్రాంతి మాకు మరచిపోలేని బహుమతి ఇచ్చింది. ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూశాం.
ఇప్పటి వరకు నేను ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ చూడలేదు. ఈరోజు నా జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు’ అన్నారు. ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ.. ‘డాకు మహారాజ్ చిత్రంపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రానికి పని చేయడం ఒక మంచి అనుభూతి’ అన్నారు.