19-04-2025 12:00:00 AM
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుని దశాబ్ది కాలం దాటింది. ఇంతలోనే తెలంగాణలో సామాజిక న్యాయం కోసం అణగారిన వర్గాలు కేంద్రంగా ‘జాయింట్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటు చేసు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ ఉద్దేశంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ ఆశయాలు ప్రత్యేక రాష్ట్రంలో నెరవేర లేదు. కారణం రాష్ట్రంలో ఉన్న 10 శాతం అగ్రకులాల వల్ల బలహీన వర్గాలకు ఒరిగిందేమీ లేదు.
భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 90 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఉన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో జనా భా దామాషా ప్రకారం సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా న్యాయం జరగడం లేదు. ముందు నుంచి అగ్రకులాల వాళ్లే పాలక వర్గంలో ఉండ టం మూలంగా బలహీన వర్గ ప్రజల సమస్యలు తీరడం లేదు. మన రాష్ట్రంలో ఇప్ప టి వరకు ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అయితే, దురదృష్ట వశాత్తు అన్ని ఉద్యమాల్లోనూ అణగారిన వర్గాల కృషిని ఉపయో గించుకుని, అగ్రకులాల వాళ్లు అందెలమెక్కారు. అందువల్ల ఎవరు కాదన్నా పీడిత ప్రజలకు విముక్తి కల్పించింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాత్రమే.
కాబట్టి, రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు భారత రాజ్యాంగ మార్గంలో ప్రయాణం చేసినప్పుడే పాలకులుగా మారి సింహాసనం మీద కూర్చోగలరు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజల్లో ఈ మేరకు చైతన్యం వచ్చినప్పుడే రాజ్యాంగ బద్ధంగా సామాజిక న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకానీ, అగ్రకులాలకు చెందిన పాలకుల చెంతన ఉన్నంత కాలం అణగారిన వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురవుతూనే ఉంటారనే చరిత్రను క్షణ్ణంగా పరిశీలిస్తే అర్థమవుతుంది.
అందుకోసమే తెలంగాణలో సామాజిక న్యాయాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో గత నెల 31న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ హక్కులు రాజ్యాధికార సాధన’ జేఏసీ ఆవిర్భవించింది. అలాగే, సాధించుకున్న తెలంగాణలో సబ్బండ కులాలకు సామాజిక న్యాయం జరగడం కోసమే ‘బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ రాజ్యాధికార సాధన: జేఏసి’ ఏర్పాటు జరిగింది.
ఈ జేఏసీ ఏర్పాటులో ‘ధర్మ సమాజ్ పార్టీ’ వ్యవస్థాపకులు డా. విశారదన్ మహారాజ్ ముఖ్య వ్యక్తి అయినప్పటికీ ఇందులో సింహభాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులే ఉన్నారు. ఈ ఆవిర్భావ కార్యక్రమానికి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ టీ. చిరంజీవులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే, సబ్బంగ వర్గాలకు చెందిన మేధావులు, ప్రొఫెసర్లు ఇందులో పాల్గొన్నారు.
మా భూమి రథయాత్ర
తెలంగాణలో సామాజిక న్యాయం తీసుకు రావడానికి కులమతాలకు, పార్టీలకు అతీతంగా ఫూలే, అంబేద్కర్, కాన్షీరామ్ చూపిన మార్గంలో నడవాలని ఈ సందర్భంగా అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. విశారదన్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఒక లక్ష కిలోమీటర్ల మేర రథయాత్ర చేయాలనీ నిర్ణయించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మొదలైన ఈ రథయాత్ర 2028 జూలై 11న ముగుస్తుంది. తెలంగాణలోని అన్ని ఉమ్మడి జిల్లాల మీదుగా ఈ యాత్ర కొనసాగి హైదరాబాదులోని జింఖానా స్టేడియంలో భారీ బహిరంగ సభతో ముగియనుంది. ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ హక్కులు రాజ్యాధికార సాధన: జేఏసీ’, ధర్మ సమాజ్ పార్టీ సంయక్తంగా నిర్వహిస్తున్న ఈ రథయాత్రకు ‘మా భూమి రథయాత్ర’గా పేరు పెట్టడం గమనార్హం.
ఒకప్పుడు చైనాలో భూస్వాములకు వ్యతిరేకంగా మావో ఆధ్వర్యంలో దాదాపు 9 వేల కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది. తెలంగాణలో అగ్రకులాల ఆధీనంలో లక్షల ఎకరాల భూమి ఉంది. వాళ్ల చేతిలో పెద్ద మొత్తంలో భూమి ఉండటం వల్లే సామాజికంగా, రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తూ అన్ని రంగాల్ని ప్రభావితం చేయగలుగుతున్నారు.
అందువల్ల ఆ భూమికోసమే ‘మా భూమి రథయాత్ర’ పేరుతో ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ హక్కులు రాజ్యాధికార సాధన: జేఏసీ’, ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విశారదన్ రథయాత్ర నిర్వహిస్తున్నారు. అణగారిన వర్గాల రాజ్యాధికారమే ధ్యేయంగా ఏర్పడిన జేఏసీ.. ఫూలే, సాహు మహారాజ్, అంబేద్కర్, కాన్షీరాం, బీపీ మండల్, పండుగ సాయన్న ముదిరాజ్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, కొండా లక్ష్మణ్ బాపూజీ, సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మ ప్రభృతుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుంది.
ఆ ఆకాంక్షల సాధనే లక్ష్యంగా!
కేసీఆర్, రేవంత్‌రెడ్డి ప్రభుత్వాల్లో సామాజిక న్యాయం లోపించింది. అందుకు తాజాగా నిర్వహించిన కులగణన సర్వే వివరాలే నిదర్శనం. సర్వే ప్రకారం రాష్ట్రంలో దాదాపుగా 56 శాతం బీసీలు, 17 శాతం ఎస్సీలు, 12 శాతం ఎస్టీలు, 15 శాతం అగ్రకులాల వారు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో కేవలం 5 శాతం కూడా లేని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులు (పార్టీలకు అతీతంగా) రాష్ట్ర అసెంబ్లీలో 43 మంది ఉన్నారు. 0.5 శాతం ఉన్న వెలమ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు 13 మంది, జనాభాలో 1 శాతం కూడా లేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు.
అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల వల్ల 19 మంది ఎస్సీ, 12 మంది ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 56 శాతం మంది బీసీలే అయినప్పటికీ తెలంగాణ అసెంబ్లీలో బీసీ ఎమ్మెల్యేల సంఖ్య 20 మంది లోపే. రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు కావట్లేదని చెప్పడానికి ఈ ఒక్క ఉదహరణ చాలదా? ఇందుకోసమే నేడు తెలంగాణ రాష్ట్రంలో ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ హక్కులు రాజ్యాధికార సాధన: జేఏసీ’ ఏర్పడింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నాం. ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత తెలంగాణలో రాజ్యాధికారం, సంపద, భూములు తిరిగి అగ్రకులాల పాలకుల చేతుల్లోకే వెళ్లిపోయాయని అర్థమవుతున్నది.
నిరుపేదలకు సాగుభూమి ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, దానిని సరిగా అమలు చేయలేదు. నిధుల విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దాదాపు మూడు లక్షల కోట్లు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి కోసం కావాల్సిన మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించక పోవడం విచారకరం. దీన్నిబట్టి అగ్రకులాల పాలకులకు అణగారిన వర్గాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని తెలుస్తున్నది.
తెలంగాణను పదేళ్లపాటు పాలించిన గత ప్రభుత్వం 7 లక్షల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టి వెళ్లారు. ఇక నియామకాల విషయానికి వస్తే ఇక్కడా నిరాశే ఎదురైంది. తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ శాతం పాల్గొన్నది బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులే. రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం దాటినా ఆశించిన స్థాయిలో ఉద్యోగ నియామకాలు జరగలేదు.
దీన్నిబట్టి అగ్రకులాల పాలకులవల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి బలహీన వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జేఏసీ ఏర్పాటు అనివార్యమైంది. బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం రావడం వల్ల జనాభా దామాషా ప్రకారం బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలోని బలహీన వర్గాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యంగబద్ధంగా సామాజిక న్యాయం అమలు కావాలనే ఆకాంక్షతోనే జేఏసీ ఆవిర్భవించిందనే విషయాన్ని మేధావులు, విద్యావంతులు, ప్రజాస్వామ్య వాదులు అందరూ గ్రహించాలి.
వ్యాసకర్త: పుల్లెంల గణేష్ సెల్: 9553041549