calender_icon.png 22 October, 2024 | 11:12 AM

సినీ నిర్మాతలకు ఐటీశాఖ సూచనలు

23-07-2024 12:05:00 AM

తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి సభ్యులతో ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ సోమవారం ఔట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదాయపు పన్ను జాయింట్ కమిషనర్ మూకాంబికేయన్ అధ్యక్షత వహించారు. సంబంధిత శాఖాధికారులు మురళీధర్, శ్రీనివాసరావు, సతీశ్‌తోపాటు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, గౌరవ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్, ఇతర ఛాంబర్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి ప్రభుత్వం విధించిన గడువు తేదీల గురించి జాయింట్ కమిషనర్ మూకాంబికేయన్ చాంబర్స్ సభ్యులకు వివరించారు.

సినిమాల నిర్మాణ వ్యయం, రాబడికి సంబంధించిన అకౌంటింగ్, రాబడుల అడ్మిషన్ తదితరాలకు సంబంధించి చిత్ర నిర్మాతలకు ఉన్న ప్రత్యేక నిబంధనలతోపాటు వారి ఆదాయ పన్ను రిటర్న్స్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తాజా నిబంధనలపై చాంబర్స్ సభ్యులు వ్యక్తం చేసిన సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. సినిమా నిర్మాణానికి సంబంధించిన వివిధ ఆదాయ పన్ను సమస్యలపై తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యులు, సభ్యులు ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్లతో చర్చించారు. ఆదాయ పన్నుల శాఖ ఔట్ రిచ్ నిర్వహించటంపై అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేస్తూ ఆ శాఖాధికారులకు ధన్యవాదాలు తెలిపారు.