calender_icon.png 25 October, 2024 | 5:01 AM

ట్రాఫిక్ హబ్‌గా ఐటీ రాజధాని

25-10-2024 02:29:57 AM

  1. భారీ వర్షంతో బెంగళూరు అతలాకుతలం
  2. ఎలక్ట్రానిక్ సిటీ ప్లుఓవర్‌పై భారీ ట్రాఫిక్ జామ్
  3. వాహనాలు విడిచి నడుచుకుంటూ వెళ్లిన టెకీలు

బెంగళూరు, అక్టోబర్ 24: దేశంలో మొదటి ఐటీ హబ్‌గా మారిన బెంగళూరు నేడు ట్రాఫిక్ హబ్‌గా పేరు తెచ్చుకుంటోంది. దేశంలో ఎన్నో నగరాలు సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ ఐటీ రాజధానిగా బెంగళూరు కీర్తి గడిస్తోంది. మరోవైపు బెంగళూరు పేరు చెబితే ట్రాఫిక్ గుర్తొచ్చి వాహనదారులు భయపడే పరిస్థితి నెలకొంది.

రద్దీ సమయాల్లో కిలోమీటర్ దూరానికే గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుంటామని, సగం జీవితం రోడ్డు మీదే గడపాల్సి వస్తుందని నగరవాసులు తరచూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. సాధారణ సమయంలోనే ఈ పరిస్థితి ఉంటే వర్షం పడితే ఏర్పడే సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రయాణికులకు ప్రత్యక్ష నరకమనే చెప్పవచ్చు. బుధవారం రాత్రి అలాంటి పరిస్థితే ఎదురైంది. బెంగళూరులో కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. 

ఫ్లుఓవర్‌పైనే 4 గంటలు

బెంగళూరులో వర్ష తీవ్రతకు చాలా ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. మోకాళ్ల లోతు నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇప్పటికే భారీ ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్న బెంగళూరు రోడ్లు వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఎలక్ట్రానిక్ సిటీ ప్లుఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమ పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయం కావడంతో సమస్య తీవ్రమైంది. దాదాపు 3 నుంచి 4 గంటల పాటు ప్లుఓవర్‌పైనే చిక్కుకుపోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా అర్థం చేసుకోవచ్చు. ట్రాఫిక్‌తో విసుగుచెందిన కొందరు వాహనాలు దిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. 

ప్రత్యామ్నాయ మార్గాలు అవసరం

ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు దేశంలో అత్యంత రద్దీ ప్రదేశంగా గుర్తింపు పొందింది. కొద్ది దూరానికే బెంగళూరు వాసులు గంటలపాటు వేచి చూడాల్సి రావడం అలవాటుగా మారిపోయింది. ట్రాఫిక్‌తో ప్రయాణం నరకప్రాయంగా ఉండే నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉంటుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న టెకీల్లో ఎక్కువ శాతం బెంగళూరులో ఉంటారు.

హైదరాబాద్‌లో రాయదుర్గ్, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కొండాపూర్‌ను మించి బిజీ హవర్స్‌లో భారీ ట్రాఫిక్ బెంగళూరు ఐటీ సర్కిల్‌లో ఉంటుంది. ఎలక్ట్రానిక్ సిటీ, హోసూరు, సిల్వర్ కంట్రీ రోడ్, బిర్లా జంక్షన్, రామారెడ్డి సర్కిల్, చెన్నకేశవనగర్ ఫస్ట్ క్రాస్ వంటి ఏరియాల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. సిటీని మరింత విస్తరించడంతో పాటు ప్లుఓవర్ల సంఖ్యను పెంచాలని, ప్రత్యామ్నాయ మార్గాలను విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు.