- రూ.300 కోట్ల లావాదేవీలపై ఆరా
- పలు పత్రాలు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
హైదరాబాద్ సిటీ బ్యూరో/రంగారెడ్డి, నవంబర్18 (విజయక్రాంతి) : నగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. ప్రముఖ స్వస్తిక్ గ్రూప్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ షాద్‌నగర్‌లో ఇటీవల ఓ కార్పోరేట్ సంస్థకు రూ.300కోట్లకు పైగా విలువ చేసే భూములను విక్రయించింది.
ఆ కంపెనీకి సంబంధించి ఆర్థిక లావాదేవీల బ్యాలెన్స్ షీట్‌లో రూ.300కోట్ల వివరాలు వెల్లడించలేదని గుర్తించిన ఐటీ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి.. భారీ బందోబస్తు నడుమ బేగంబజార్‌లోని స్వస్తిక్ మిర్చి కార్యాలయంతోపాటు బంజారాహిల్స్, చేవెళ్ల, షాద్‌నగర్‌లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
అలాగే ఆ కంపెనీకి సంబంధించిన పరిశ్రమలు, ఆ కంపెనీతో వ్యాపార లావాదేవీలు నిర్వహించిన వ్యాపారుల కార్యాలయాలు, నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్టలోని స్వస్తిక్ మిర్చీ పౌడర్, ఎలైట్‌లైవ్ ఉడ్, ఫోర్ ఆగ్రో పరిశ్రమలు, పట్టణంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆకుల రవికుమార్, వాసవి చిట్‌ఫండ్ అధినేత బండారి రమేశ్‌తోపాటు ఆ సంస్థ మేనేజర్లు కల్పనారాజేంద్ర, లక్ష్మణ్ నివాసాలలో అధికారులు మధ్యాహ్నం వరకు తనిఖీలు చేసి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.