మంచిర్యాల (విజయక్రాంతి): సివిల్ కానిస్టేబుళ్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ లో సిపి శ్రీనివాసులు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలో అంకిత భావంతో పని చెయ్యాలని, పోలీసింగ్ ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోని ప్రజలకు సేవలు అందించాలని, వృత్తిపరమైన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, బాధతో పోలీసు స్టేషన్‌కు వచ్చే వారికి భరోసా ఇచ్చేలా విధి నిర్వహణ ఉండాలని సూచించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి పోలీస్ శాఖకు ఎంపికైన 392 మంది (236 మంది సివిల్ కానిస్టేబుళ్లు, అందులో 83 మంది సివిల్ మహిళా కానిస్టేబుళ్లు, 156 మంది ఆర్ముడ్ కానిస్టేబుళ్లు, అందులో 37 మంది ఆర్ముడ్ మహిళా కానిస్టేబుళ్లు) వివిద పోలీస్ శిక్షణ కేంద్రాలకు శిక్షణకు వెళ్ళి 9 నెలల కఠినమైన పోలీస్ శిక్షణ పూర్తి చేసుకున్నారని అన్నారు.
విధి నిర్వహణలో కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నీతి నిజాయితీతో విధులు నిర్వహిస్తే ప్రజలు ఆదరిస్తారన్నారు. పోలీస్ శాఖలో ఉద్యోగం అంటేనే అనేక సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమని మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఎఆర్ ఏసీపీ సుందర్ రావు, ఎఓ అశోక్ కుమార్, ఆర్ఐలు దామోదర్, మల్లేశం, వామన మూర్తి, శ్రీనివాస్, సూపరింటెన్డెంట్లు ఇంద్ర సేనా రెడ్డి, మనోజ్ కుమార్, సంధ్య, ఇన్స్పెక్టర్ లు, ఆర్ఎస్ఐ, నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.