calender_icon.png 27 October, 2024 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి

27-10-2024 01:21:33 AM

రణరంగంగా మారిన పశ్చిమాసియా

ఇరాన్‌లోని సైనిక, క్షిపణి స్థావరాలే లక్ష్యంగా అటాక్

డ్రోన్, క్షిపణి తయారీ కేంద్రాలపైనా దాడి

దాడుల్లో ఇద్దరు ఇరాన్ సైనికుల మృతి

దక్షిణ టెహ్రాన్‌లోని డ్రోన్ కర్మాగారం ధ్వంసం

టెల్‌అవీవ్, అక్టోబర్ 26: ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. దశాబ్దాల శత్రుత్వం ఒక్కసారిగా రెక్కలు విప్పింది. ఇన్నాళ్లు హమాస్, హెజ్బొల్లా లక్ష్యంగా దాడులు చేస్తో న్న ఇజ్రాయెల్ శనివారం ఏకంగా ఇరాన్‌పైనే దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. అక్టోబర్ 1న ఇరాన్ బాలి స్టిక్ క్షిపణులు ప్రయోగించగా ప్రతీకారం తీర్చుకుంటామని చేసిన ప్రతిజ్ఞను ఇజ్రాయెల్ ప్రధా ని  నెరవేర్చుకున్నారు. శనివారం ఉదయం నుంచే ఇరాన్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది.  క్షిపణి, డ్రోన్ తయారీ కేంద్రాలపైనా ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) దాడులు చేసింది. 

ఇద్దరు సైనికులు మృతి

ఇరాన్ తయారు చేస్తోన్న క్షిపణలు, డ్రోన్లతో తమ పౌరులకు ముప్పు పొంచి ఉందని, అందుకే వాటిని ధ్వంసం చేశామని ఐడీఎఫ్ వెల్లడించింది. సుమారు 100 ఫైటర్ జెట్లతో 20 లక్ష్యాలపై దాడులు చేశామని, ప్రస్తుతానికి ఇరాన్‌పై తమ దాడులు ముగిశాయని ఐడీఎప్ స్పష్టం చేసింది. ఇరాన్‌లో ఇజ్రాయెల్ దాడితో జరిగిన నష్టంపై ఎలాంటి వివరాలు బయటికి రాలేదు. తమ దేశంపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో ఇద్దరు సైనికులు చనిపోయారని ఇరాన్ తెలిపింది. దక్షిణ టెహ్రాన్‌లోని ఓ డ్రోన్ కర్మాగారం పూర్తి ధ్వంసమైనట్లు వెల్లడించింది. కానీ పెద్దగా నష్టం వాటిల్లలేదని పేర్కొంది.   

మమ్మల్ని రక్షించుకునేందుకే దాడులు..

ఇరాన్, దాని మద్దతుదారులు గతేడాది అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్‌పై కిరాతకంగా దాడులు చేస్తున్నారని, దీనిపై సార్వభౌమ దేశంగా తమకు స్పందించే హక్కు ఉందని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ పేర్కొ న్నారు. తమ దేశాన్ని, పౌరులను రక్షించుకునే బాధ్యత తమకు ఉందని స్పష్టం చేశారు. అందు కే ఇరాన్ దాడులకు ప్రతీకారంగా సైనిక స్థావరాలపైనే దాడులు చేశామని వెల్లడించారు. 

క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా..

ఇరాన్‌లోని అణు స్థావరాలతో పాటు అందులో పనిచేసేవారిపై ఇజ్రాయెల్ దృష్టి పెట్టినట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇరాన్ నుంచి ఎప్పటికైనా తమకు అణు ముప్పు ఉందని భావిస్తున్న ఇజ్రాయెల్.. అక్కడి అణు విభాగానికి సంబంధించిన అధికారులను చంపేస్తూ వస్తోంది. టెహ్రాన్ సమీపంలోని ఇరా న్ న్యూక్లియర్ ప్లాంట్‌పైనా చాలాసార్లు దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇరాన్ ప్రధాన ఆదాయ వనరైన చమురు వాణిజ్యాన్ని దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇరాన్‌కు కీలకమైన రెవల్యూషనరీ గార్డ్స్ దళంలోని కీలక వ్యక్తులను ఒక్కొక్కరిగా మట్టుబెడుతోంది. బీరుట్‌లో హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా ను చంపిన సమయంలో అక్కడే ఉన్న ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిల్ ఖనీ కూడా హతమైనట్లు వార్తలు వచ్చాయి. 

పొరుగు దేశాల ఆందోళన 

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో సౌదీ అరేబియా స్పందించింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని ఖండిస్తూ తమ ప్రాంతంలో భద్రత, ప్రజల హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించడాన్ని ఖండించింది. ఇజ్రాయెల్ చేసిన దాడులకు ఇరాన్ స్పందించకుండా సంయమనం పాటిం చి శాంతికి సహకరించాలని బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ కోరారు. యూఏఈ కూడా ఇజ్రాయెల్ దాడిని ఖండించింది.

విమానయానంపై ప్రభావం

ఇరాన్, ఇజ్రాయెల్ ఒకప్పుడు మిత్రదేశాలుగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల బద్ధ శత్రువులుగా మారాయి. ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ప్రత్యక్ష యుద్ధానికి దిగలేదు. ఇరాన్ అక్టోబర్ 1న చేసిన దాడికి ప్రతీకారంగా తాజాగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేయడంతో పశ్చిమాసియాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాక్ విమానాలను నిలిపేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇరాక్ గగనతలంలో పౌర విమానయాన భద్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు విమాన రాకపోకలు నిలిపేసినట్లు ఇరాక్ రవాణా మంత్రి ప్రకటన చేశారు. ఇరాన్ కూడా తమ గగనతలంలో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది.