calender_icon.png 17 November, 2024 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెతన్యాహుపై ఇజ్రాయెలీల తిరుగుబాటు

03-09-2024 12:25:58 AM

  1. బందీల మరణంతో ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహం
  2. టెల్ అవీవ్ సహా అనేక నగరాల్లో ఆందోళనలు
  3. సీజ్ ఫైర్ అమలు చేయాలని డిమాండ్
  4. నెతన్యాహూపై రాజకీయ పరమైన ఆరోపణలు
  5. ప్రజలకు క్షమాపణలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రెసిడెంట్

ఇజ్రాయెల్, సెప్టెంబర్ 2: గాజాలోని రఫా నగరంలో ఆరుగురు బందీల మృతదేహాలు లభించడంపై ఇజ్రాయెల్‌లో ఆగ్రహం పెల్లుబికింది. ఇజ్రాయెల్‌లో ప్రజలు భారీగా వీధుల్లోకి వచ్చి ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. టెల్ అవీవ్‌లో నిరసనల ప్రభావం తీవ్రంగా కనిపించింది. దాదాపు 5 లక్షల మంది రోడ్లపైకి వచ్చారు. గతేడాది అక్టోబర్ 7 తర్వాత ఇజ్రాయెల్ అతిపెద్ద ప్రజల నిరసన ఇదే కావడం గమనార్హం. హమాస్ చేతిలో చిక్కుకున్న బందీల విడుదలకు ప్రభుత్వం, నెతన్యాహు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు.

హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే ఈ పాటికి సమస్య సద్దుమణిగి ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కారణా లతోనే జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వీలైనంత త్వరగా హమాస్‌తో ఒప్పందం చేసుకుని, మిగిలిన 101 మంది బందీలను స్వదేశానికి తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. టెల్‌అవీవ్‌తో పాటు ఇతర నగరాల్లోనూ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. 

కార్మికుల సమ్మె

గాజాలో బందీల మరణాలకు నిరసనగా వివిధ సంఘాలు, కార్మికులు సైతం ఆందోళన చేపట్టారు. దేశంలో అతిపెద్ద ట్రేడ్ యూనియన్ జనరల్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ దేశవ్యాప్తంగా సోమవారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. బ్యాంకింగ్, ఆరోగ్యం, విమాన సేవలతో పాటు ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన రంగాలకు అంతరాయం కలిగించే లక్ష్యంగా నిరసనలకు  వీరు పిలుపునిచ్చారు. ప్రజల ప్రాణాలను రక్షించడం కన్నా తన సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపైనే నెతన్యాహూ దృష్టి సారించారని ప్రతిపక్ష నేత యైర్ లాపిడ్ ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహూ తనను తాను కాపాడుకునేందుకు యుద్ధాన్ని ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.

మిగిలిన బందీలను కాపాడేందుకు హమాస్‌తో ఒప్పందం  కుదుర్చుకోవాలని కైద్ ఫర్హాన్ ఎల్కాడి కోరారు. గతవారంలో ఎల్కాడిని గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలు రక్షించాయి. కాగా, ఎల్కాడి బుధవారం సురక్షితమైన దక్షిణ ఇజ్రాయెల్‌లోని తన సొంత గ్రామానికి చేరుకున్నారు. సమ్మె కారణంగా టెల్ అవీవ్‌లోని బెన్‌గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2 గంటల పాటు కార్యకలాపాలను నిలిపేశారు.

గాజాలో హమాస్ చెరలో ఉన్న బందీలను తిరిగి ఇజ్రాయెల్‌కు తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమ్మె చేస్తున్నట్లు కార్మిక సంఘం స్పష్టం చేసింది. మరోవైపు బందీలను అక్కడే వదిలేసి యుద్ధం చేస్తోన్న నెతన్యాహూ బాధ్యత వహి స్తూ ప్రకటన చేయాలని బందీల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఆరుగురు బందీలు 11 నెలల పాటు హమాస్ చేతిలో చిత్రహింసలకు గురయ్యారని, ఆకలితో అలమటించి చివరికి హత్యకు గురయ్యారని ఆరోపించారు. ఒప్పందంలో జాప్యమే బందీల మృతికి కారణమని వీరు ఆరోపిస్తున్నారు. 

క్షమాపణలు చెప్పిన అధ్యక్షుడు

గాజాలో బందీల హత్యలపై ప్రధాని నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. హత్యలకు కారకులైనవారిని న్యాయస్థానం ముందు  ఉంచేవరకు ఆగేది లేదని ప్రకటించారు. దేశ భద్రతకు భరోసా ఇస్తూనే మిగిలిన బందీల విడుదలకు ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టి సారిస్తునట్లు నెతన్యాహు ఒక ప్రకటనలో వెల్లడించారు. కాగా, మృతదేహాలను ఇజ్రాయెల్‌కు తీసుకొచ్చామని ఐడీఎఫ్ ఆదివారం ఓ నివేదికలో పేర్కొంది. మరణించినవారి కుటుంబాలకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. కాగా, బందీలను సురక్షితంగా ఇజ్రాయెల్‌కు తీసుకురావ డంలో విఫలమైనందుకు ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ అన్నారు.

మృతుల్లో అమెరికన్ పౌరుడు గోల్డ్‌బెర్గ్ ఉండటంపై అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసి చాలా బాధపడ్డానని, కోపం వచ్చిందని పేర్కొన్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో జరుగుతున్న మ్యూజిక్ ఫెస్టివల్‌పై దాడిన చేసిన హమాస్ ఫైటర్లు దాదాపు 1,200 మందిని చంపి 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు. దీనికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టించింది. ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 40వేల మందికిపైగా మరణించినట్లు గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.