- హెచ్చరికలు చేయకుండానే అటాక్స్
- 4౦ మంది మృతి
- ఉత్తర గాజాలోనూ 32 మంది..
బీరూట్, నవంబర్ 10: ఇరాన్ అనుకూల హెజ్‌బొల్లా ఉగ్రసంస్థ నిర్మూలనే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. రాజధాని బీరూట్‌పై జరిపిన దాడుల్లో 40 మంది చనిపోయారు. అలాగే సముద్ర తీర ప్రాంతమైన టైర్ సిటీపైనా దాడులు చేసింది.
సాధారణంగా దాడులు చేసే ప్రాంతంలో ఇజ్రాయె ల్ ముందే హెచ్చరిస్తుంది. కానీ శనివారం జరిపిన దాడులపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదని లెబనాన్ ఆరోగ్యశాఖ తెలిపింది. గత సంవత్సర కాలంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లెబనాన్‌లో మొత్తం 3,136 మంది మృతి చెందారని, 13 వేల మందికిపైగా గాయపడ్డారని లెబనాన్ అధికారులు పేర్కొన్నారు.
ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలి యాలోని ఓ ఇంటిపై ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో సుమారు 32 మంది చనిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది.
హూతీలపై అమెరికా దాడులు
యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులపై శనివారం సాయంత్రం అమెరికన్ సైన్యం విరుచుకుపడింది. మొత్తం మూడు చోట్ల ఆయుధ డిపోలను ధ్వంసం చేసింది. ముందుగా రెడ్ సీ గుండా వెళ్తున్న నౌకలను టార్గెట్ చేశామని, వాటిలోని అత్యాధునిక ఆయుధ డిపోలను పేల్చేశామని తాజాగా పెంటగాన్ నుంచి ప్రకటన విడుదలైంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన తర్వాత జరిగిన మొట్టమొదటి సైనిక దాడి ఇదే.
కాల్పుల విరమణ దిశగా..
హెజ్‌బొల్లాపై దాడులు చేస్తున్నప్పటికీ ఉత్తర సరిహద్దులోని లెబనాన్, గాజాతో పరిమిత కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఆలోచిస్తున్నట్లు పశ్చిమాసియాలోని పలు స్థానిక మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో ఆ ప్రభావం ఇజ్రాయెల్‌పై పడుతోంది.
గాజాలో దాడులను నిలిపివేయా లని, లేకుంటే ఇజ్రాయెల్‌పై పలు ఆంక్ష లు విధించాలని ఐరాస నిర్ణయించినట్లు తెలుస్తోంది. క్రమంలో లెబనాన్‌తో పరిమిత కాల్పుల విరమణ దిశగా ఇజ్రా యె ల్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే అందుకు సంబంధించి ఒప్పందం లో ఏముందనేది బయటికి రావడం లేదు.
మధ్యవర్తిత్వం నుంచి తప్పుకున్న ఖతర్
న్యూఢిల్లీ, నవంబర్ 10: హమాస్-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఖతర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ కోసం ఒప్పందం కుదరకవడంతో మధ్యవర్తిత్వం నుంచి వైదొలిగినట్టు స్పష్టంచేసింది.
ఇరుదేశాలు కాల్పుల విరమణకు సుముఖత వ్యక్తం చేసినప్పుడే ఖతర్ తమ ప్రయత్నాలను తిరిగి మొదలుపెడుతుందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజీద్ మహ్మద్ అల్ అన్సారీ పేర్కొన్నారు. ఖతర్ తన ఉద్దేశాన్ని 10 రోజుల క్రితమే ఆ దేశాలకు తెలియజేసినట్టు స్పష్టం చేశారు. హమాస్ తో యుద్ధం ప్రారంభమైనాటి నుం చి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఖతర్ ప్రయత్నిస్తోంది.